టేకు బ్యాంక్ సేవలు భేష్
ఏలూరు అర్బన్ : ఏలూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (టేకు బ్యాంక్) జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడం అభినందనీయమని ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. స్థానిక కోటదిబ్బ వద్ద నున్న మర్చంట్స్ చాంబర్ కల్యాణమండపంలో శనివారం టేకు బ్యాంకు శతదినోత్సవ వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా ఎంపీ బాబు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలనే ఆశయంతో వందేళ్ల కిందట నాటి పెద్దలు స్థాపించిన సహకార బ్యాంకు దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ ఖాతాదారుల మనసులను దోచుకుందన్నారు. బ్యాంకు ఛైర్మన్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ తమ బ్యాంకు ప్రస్తుతం రూ.45 కోట్ల డిపాజిట్లతో రాష్ట్రంలోని కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో మొదటి వరుసలో నిలుస్తుందన్నారు. బ్యాంకును విస్తరించేందుకు ఏలూరు టూటౌన్ ప్రాంతంలో మరో బ్రాంచి ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ టేకు బ్యాంకు నిర్వహణలో పాలక మండలి చైర్మన్ అంబికా ప్రసాద్, వైస్ చైర్మన్ బి. కరుణకుమార్ల కష్టం ఎంతగానో ఉందన్నారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకింగ్ రంగ పరిస్థితి కత్తిమీద సాముగా మారిందని, ఏ బ్యాంకు ఎప్పుడు మూత పడుతుందో తెలియనిస్థితిలో టేకు బ్యాంకు వందేళ్ల పండుగ చేసుకోవదం ఆనందదాయకమన్నారు. నగర మేయర్ షేక్ మాట్లాడారు. అనంతరం బ్యాంకు యాజమాన్యం ఏపీ కో-అపరేటివ్ అర్బన్ బ్యాంకు అండ్ క్రెడిట్ సొసైటీస్ జనరల్ సెక్రటరీ సీహెచ్ రాఘవేంద్రరావు, ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జి.రామ్మూర్తిలను శాలువాలతో సత్కరించారు.