అత్త వేధింపులు తాళలేక..తోడికోడళ్ల ఆత్మహత్య
గన్నవరం(కృష్ణా): కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో అత్తింట్లో వేధింపులు భరించలేక ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలివీ...గ్రామంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన నక్కా భూలక్ష్మి కుమారులు రాంబాబు, శివ. వ్యవసాయ పనులు చేసుకునే వీరిద్దరికీ గ్రామానికే చెందిన రమణమ్మ(20), ఝాన్సీరాణి(19)లతో ఏడు నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం గర్భవతులైన కోడళ్లిద్దరినీ అత్త భూలక్ష్మి కొన్ని రోజులుగా తీవ్రంగా వేధిస్తోంది.
వీటిని తట్టుకోలేక యువతులిద్దరూ కుటుంబసభ్యులకు మొరపెట్టుకున్నారు. రెండు రోజుల క్రితమే పెద్దలు కలుగజేసుకుని..వారిని ఇబ్బంది పెట్టవద్దని భూలక్ష్మికి చెప్పారు. అయితే, బుధవారం భర్తలు, అత్త పొలం పనులకు వెళ్లిన సమయంలో రమణమ్మ, ఝాన్సీరాణి ఇంట్లోనే చీరతో ఉరి వేసుకున్నారు. మధ్యాహ్నం భర్తలు వచ్చి చూసేసరికి విగత జీవులై కనిపించారు. కాగా, వారిని అత్తింటి వారే చంపారని మృతుల పుట్టింటి వారు వాదిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.