ఆ క్రెడిట్ కెప్టెన్ ఒక్కడిదే కాదు: కోచ్ రోకా
బెంగళూరు: తాము కేవలం ఒకే ఆటగాడి ప్రదర్శనపై ఎప్పూడు ఆధారపడి లేమని బెంగళూరు ఎఫ్సీ జట్టు కోచ్ అల్బర్ట్ రోకా స్పష్టంచేశాడు. స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి రెండు అద్బుత గోల్స్ చేయడంతో బెంగళూరు జట్టు ఏఎఫ్ సీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు, టెక్నికల్ స్టాఫ్ అందరి శ్రమ ఇందులో దాగి ఉందన్నాడు. సెమిఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ జోహర్ దరుల్ టాజిమ్ పై 3-1 గోల్స్ తేడాతో బెంగళూరు నెగ్గింది.
భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి వల్లే బెంగళూరు ఫైనల్ చేరిందని వస్తున్న కామెంట్లపై ఆ టీమ్ కోచ్ అల్బర్ట్ రోకా తీవ్రస్థాయిలో స్పందించాడు. ఏఎఫ్ సీ కప్ ఫైనల్లోకి ఓ భారత జట్టు ప్రవేశించడం ఇదే తొలిసారి. ఛెత్రి కెప్టెన్సీలో ఆటగాళ్లందరూ రాణించడం వల్ల బెంగళూరు నెగ్గిందనీ.. అంతేకానీ వన్ మ్యాన్ షో అని అనడం సరికాదని సూచించాడు. మరోవైఫు ఫైనల్స్ చేరిన ఇరాక్ జట్టు ఎయిర్ ఫోర్స్ ఎఫ్సీ ఈ టోర్నీలో 26 గోల్స్ చేసిందని, ముందు ఆ విషయంపై తమ జట్టు ఫోకస్ చేస్తోందని బెంగలూరు కోచ్ రోకా వివరించారు.