coal purchase
-
నిజాలకు మసిబొట్టు.. బాబు కోసం కనికట్టు
సాక్షి, అమరావతి: ‘మన చంద్రబాబు కాదు కదా.. వెయ్యండి బురద’ అంటూ రామోజీ మరోమారు తన ద్వంద్వ నీతి రాతలతో ప్రజల్లో విషం నింపే కార్యక్రమంలో ఇంకో అడుగు ముందుకు వేశారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గును అధిక ధరతో కొన్నారనే సాకుతో వాస్తవాలకు మసి బొట్లు పెట్టారు. బొగ్గు కొనుగోలు టెండరులో అదానీ సంస్థ ఎల్–1గా నిలిచిందని ఒప్పుకుంటూ కూడా.. అది తప్పన్నట్లు ‘బొగ్గు టెండరూ అదానీకే’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని అచ్చేయడం కేవలం చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని కాదా? ఇదే పని చంద్రబాబు చేసి ఉంటే.. బాబు గ్రేట్ విజనరీ.. బాబు ముందు చూపు.. అని డప్పు కొట్టే వారు కాదా? సీఎం వైఎస్ జగన్ చేసినందున మీ ‘పచ్చ’కళ్లకు తప్పుగా కనిపిస్తోంది. భవిష్యత్‌లో విద్యుత్ కొరత ఉండకూడదనే దూరదృష్టితో ఈ పని చేయడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారని మీ కథనంలోని వాక్యాలు చెప్పకనే చెబుతున్నాయి. అందుకే కదా.. ఈ ప్రభుత్వం ఈ టెండర్‌ను నామినేషన్‌పై కట్టబెట్టిందన్నట్లు మీరు తిమ్మినిబమ్మి చేసి చూపడాన్ని ఏమనాలి? తక్కువ ధరకు బొగ్గు కొనుగోలు కోసం నాలుగుసార్లు టెండర్లు నిర్వహించి రద్దు చేసిన విషయం మీకు తెలియదా? ఐదోసారి టెండర్లలో అదానీ సంస్థ ఎల్–1గా నిలిచిన తర్వాతే టెండర్ ఖరారు చేశారనేది నిజం కాదా? పచ్చి నిజాన్ని అందమైన అబద్ధంగా మార్చి.. ప్రజలంతా అదే నిజమని భ్రమ పడేలా చేయాలన్న మీ ఆరాటం వల్ల మీరు రోజురోజుకూ దిగజారి పోతున్నారనే విషయాన్ని గుర్తించండి. అబ్బే.. అలాంటివన్నీ మా ఒంటికి పట్టవు అనుకుంటే ‘టీడీపీ ఈనాడు’ అని పత్రిక పేరు మార్చుకుంటే సరి. మీ కథనంలో పేర్కొన్న నిజానిజాల్లోకి వెళితే.. 20% విదేశీ బొగ్గును వాడుకోవాలంటూ కేంద్రం ఆదేశాలు ఆరోపణ: ప్రభుత్వంపై రూ.300 కోట్లు అదనపు భారం వాస్తవం: 7.50 లక్షల టన్నుల విదేశీ బొగ్గుతో 1,776 మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు ఏపీపీడీసీఎల్ ఇవ్వగలుగుతుంది. దీనికి అయ్యే వ్యయం యూనిట్‌కు రూ.4.44 చొప్పున రూ.788.54 కోట్లు. ఇదే 1,776 మిలియన్ యూనిట్లను పవర్ ఎక్సే్చంజి(బహిరంగ మార్కెట్)లో కొనుగోలు చేస్తే వెచ్చించాల్సిన సొమ్ము రూ.1,456.32 కోట్లు. పవర్ ఎక్స్చేంజిలో కొనాలంటే యూనిట్‌కు దాదాపు రూ.8.20 చెల్లించాలి. అంటే విదేశీ బొగ్గుతో ఉత్పత్తి చేయడం వల్ల రూ.668 కోట్లు డిస్కంలకు ఆదా. దేశీయ బొగ్గుతో సగటు ఉత్పత్తి వ్యయం పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్నాక, డిస్కంలకు రూ.319.78 కోట్లు నికరంగా ఆదా అవుతుంది. ఆరోపణ: 6 శాతం విదేశీ బొగ్గు చాలు.. వాస్తవం: దేశంలో తీవ్ర బొగ్గు కొరత నేపథ్యంలో బొగ్గు వినియోగంలో 20 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర ఇంధన శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల కమిటీ, సబ్ కమిటీలతో సమావేశాలు, కోల్ ఇండియా ద్వారా అన్ని జెన్కోలకు బొగ్గు సరఫరాపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. వారు చెప్పినంత విదేశీ బొగ్గును సేకరించడంలో విఫలమైతే, కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి దేశీయ బొగ్గు సరఫరాను దామాషా ప్రకారం తగ్గిస్తారు. అదీకాకుండా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లో 30 శాతం విదేశీ, 70 శాతం స్వదేశీ బొగ్గు వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా రూపొందించారు. దీని ప్రకారం 30 శాతం విదేశీ బొగ్గునే దీనికి వినియోగించాలి. టన్ను విదేశీ బొగ్గును ఎన్టీపీసీ రూ.18,509కి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపే డాక్యుమెంట్ ఆరోపణ: టన్ను విదేశీ బొగ్గు ధర రూ.10వేల నుంచి 11 వేలు వాస్తవం: విదేశీ బొగ్గు టన్ను ధర రూ.10 –11వేలకు లభిస్తుందని ఏ నిపుణులు చెప్పారో తెలియదు. నిజానికి దేశంలో రోజుకు 2.781 మిలియన్ టన్నుల బొగ్గు డిమాండ్ ఉన్నప్పటికీ 2.2 మిలియన్ టన్నులే అందుబాటులో ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు, దేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుదల కారణంగా విదేశీ బొగ్గు ధర చాలా ఎక్కువగా ఉంది. దీనికి రవాణా ఖర్చులు, జీఎస్టీ కలిపితే అదానీ కోట్ చేసిన ధర దాటిపోతుంది. బొగ్గు ధర, రవాణా చార్జీలు అంతర్జాతీయ మార్కెట్ ఇండెక్స్ రేట్లు, డాలర్ మారకం రేట్ల ఆధారంగా అదానీకి చెల్లింపులు ఉంటాయి. ప్రస్తుతం, ఎన్టీపీసీ, ఇతర రాష్ట్ర థర్మల్ పవర్ ప్లాంట్లు కేవలం ఇండెక్స్ బేస్డ్ ప్రైసింగ్ ఆధారంగా బొగ్గును సేకరిస్తున్నాయి. అదానీ ఇప్పటికే ఐసీఐ3(ఇండోనేషియన్ కోల్ ప్రైజ్) ఇండెక్స్ ఆధారంగా ఒక నౌకలో 1,65,000 మెట్రిక్ టన్నుల విదేశీ బొగ్గును తీసుకువచ్చి కృష్ణపట్నం పోర్ట్‌లో ఉంచింది. ఇండెక్స్ ఆధారంగా ఈ నౌక తీసుకువచ్చిన బొగ్గు మెట్రిక్ టన్ను ధర రూ.11,733 మాత్రమే. ఆరోపణ: అదానీకి లబ్ధి చేకూర్చేందుకే.. వాస్తవం: విదేశీ బొగ్గు కొనుగోలు కోసం ఏపీపీడీసీఎల్ ఇప్పటి వరకూ 4సార్లు బహిరంగ టెండర్లు పిలిచి ధర ఎక్కువనే ఉద్దేశంతో రద్దు చేసింది. 2021 అక్టోబర్ 20న 5 లక్షల టన్నుల కొనుగోలుకు టెండర్లు పిలవగా రూ.17,480 కోట్ చేసిన అదానీ ఎల్1గా నిలిచింది. 2022 మార్చి 28న రెండవసారి టెండర్లలో రూ. 25,650 కోట్ చేసి టైడెంట్ ఛెమ్ ఫర్ ఎల్1గా నిలిచింది. 2022 మే 4న మూడవసారి టెండర్లలో రూ.23,085 ధర కోట్ చేసి అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఎల్1గా నిలిచింది. 2022 జూలై 13న నాలుగోసారి రూ.13,990 ధర కోట్ చేసి చెట్టినాడ్ లాజిస్టిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఎల్1గా నిలిచింది. ఈ టెండర్లన్నింటినీ ఎక్కువ ధర అనే ఉద్దేశంతోనే ఏపీపీడీసీఎల్ రద్దు చేసింది. ఐదవసారి టెండర్ల అనంతరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.5.10 కోట్లు ఆదా అయ్యాయి. ఐసీఐ–3 సూచిక ప్రకారమే చెల్లింపులుంటాయని తెలిపే ఒప్పందపత్రంలోని నిబంధన టెండర్ల ద్వారా బొగ్గు కొనుగోలు కొత్త కాదు ఐదోసారి టెండర్లలో 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలు కోసం టెండర్లు పిలవగా అయిదు సంస్థలు పాల్గొన్నాయి. ఎల్1గా వచ్చిన అదానీ సంస్థ టన్ను రూ.13,219తో సరఫరా చేసేందుకు ముందుకు వచ్చి ఒప్పందం చేసుకుంది. జాతీయ థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) చేసుకున్న ఒప్పందం ప్రకారం టన్ను విదేశీ బొగ్గు సరఫరా ధర (అన్నీ కలుపుకుని)రూ.18,509 పడుతోంది. ఇదే బొగ్గును ఏపీ జెన్కో టన్ను ధర రూ.13,219తో (ప్లాంటుకు చేర్చేలా అన్నీ కలుపుకుని) కొనుగోలు చేసేందుకు బహిరంగ టెండర్ల ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. టెండర్ల ద్వారా బొగ్గు కొనుగోలు కొత్తేమీ కాదు. – బి.శ్రీధర్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్కో ఎండీ -
ఖరీదైనా.. కొంటున్నాం
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రోజూ దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి బహిరంగ మార్కెట్లో కరెంట్ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు ఇంధన శాఖపై సమీక్ష సందర్భంగా ఉన్నతాధికారులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదించారు. గత రెండు నెలల్లో సుమారు రూ.2,150 కోట్లు వ్యయం చేసి గృహ, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నట్లు వివరించారు. మార్చిలో 1,268.69 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేయగా ఏప్రిల్‌లో 1,047.78 ఎంయూలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. బొగ్గు కొనుగోలు విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, భవిష్యత్తులో మళ్లీ ఇబ్బందులు రాకుండా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్–సరఫరా, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న వాటిపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. సమీక్షలో ముఖ్యాంశాలివీ.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశ వ్యాప్తంగా బొగ్గు సంక్షోభం దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. బొగ్గు సరఫరాలో అంతరాయంతో పలు రాష్ట్రాల్లో కొరత ఏర్పడిందన్నారు. సరిపడా రైల్వే ర్యాక్స్, వెసల్స్(నౌకలు) అందుబాటులో లేకపోవడం, విదేశాల్లో బొగ్గు ధరలు భారీగా పెరగడం తదితర కారణాలన్నీ విద్యుత్ కొరతకు దారితీశాయని వివరించారు. మరోవైపు విద్యుత్ వినియోగం గతంలో కంటే అనూహ్యంగా పెరిగిందన్నారు. మూడేళ్లుగా సమృద్ధిగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు, బావుల్లో నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో వ్యవసాయ రంగం నుంచి డిమాండ్ స్థిరంగా ఉందని చెప్పారు. కోవిడ్ పరిస్థితుల తర్వాత పారిశ్రామిక ఉత్పత్తి రంగం పుంజుకోవడంతో డిమాండ్ పెరిగిందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉండటంతో ఏప్రిల్ 8న విద్యుత్ డిమాండ్ 12,293 మిలియన్ యూనిట్లకు చేరిందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని వెల్లడించారు. డిమాండ్ అంచనాలతో కార్యాచరణ గత మార్చిలో విద్యుత్తు కొనుగోలుకు రూ.1123.74 కోట్లు, ఏప్రిల్‌లో రూ.1022.42 కోట్లు వెచ్చించినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. బొగ్గు విషయంలో రానున్న రెండేళ్లు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని కేంద్రం నుంచి సంకేతాలు అందాయని, ప్లాంట్లకు కావాల్సిన బొగ్గులో కనీసం 10 శాతం విదేశాల నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్న విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కొద్ది రోజుల్లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గి ఆ మేరకు అందుబాటులోకి వచ్చి కొరత తీరినప్పటికీ వచ్చే ఏడాది మళ్లీ ఇవే పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని సూచించారు. భవిష్యత్తు డిమాండ్‌ను అంచనా వేసి ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సెకీ, ధర్మల్ విద్యుత్ సెకీతో ఒప్పందం వల్ల సుమారు 45 మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్రానికి మూడేళ్లలో మొత్తం మూడు దశల్లో అందుబాటులో వస్తుందని సీఎం జగన్ తెలిపారు. 2023 చివరి నాటికి మొదటి దశలో సుమారు 18 మిలియన్ యూనిట్లు, ఆ తరువాత రెండో దశలో 18 మిలియన్ యూనిట్లు, మూడో దశలో సుమారు 9 మిలియన్ యూనిట్లు చొప్పున అందుబాటులోకి రానుందని వెల్లడించారు. దీంతోపాటు కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల చొప్పున ధర్మల్ విద్యుత్ యూనిట్లు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. 85 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) అంచనా ప్రకారం మరో 30 మిలియన్ యూనిట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా రాష్ట్రంలో పీక్ అవర్స్‌లో సైతం మిగులు విద్యుత్తు ఉండే పరిస్థితులు ఏర్పడనున్నాయని చెప్పారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్తుపై కార్యాచరణ.. పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తద్వారా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులు పడకుండా నివారించాలన్నారు. డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్తు సరఫరా చేసేందుకు పారిశ్రామిక రంగ ప్రముఖులు, నిపుణులతో కలసి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వచ్చే వేసవిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు జెన్కో ఆధ్వర్యంలోని ప్లాంట్లను అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. 85 శాతం పీఎల్ఎఫ్ సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు చేపట్టడం వల్ల నాణ్యమైన విద్యుత్తు చౌక ధరకే అందుబాటులోకి వస్తుందన్నారు. విద్యుదుత్పత్తి ఖర్చులు తగ్గించడంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఖర్చులను నియంత్రించగలిగినా ఆదాయం సమకూరినట్లేనని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం.. పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు భరోసా కలుగుతుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా పలు మార్పులు వస్తున్నాయని, పర్యావరణ అనుకూల విధానాలతో విద్యుత్ ఉత్పత్తి జరగాలన్నారు. బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచి ఇతర మార్గాల వైపు ప్రపంచం మళ్లుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ విధానాలు అవసరమన్నారు. పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు విద్యుత్ రంగంలో ఉత్తమ ప్రత్యామ్నాయాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో 29 చోట్ల ఈ ప్రాజెక్టులకు అవకాశాలున్న నేపథ్యంలో వీటిపై దృష్టి సారించి భూ సేకరణ నుంచి అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తైతే 33,240 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు. పీక్ అవర్స్‌లో అధిక ధరలతో విద్యుత్తు కొనుగోలు చేయాల్సి రావడం లాంటి ఇబ్బందులు పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల వల్ల తొలగిపోతాయని చెప్పారు. ఒకసారి ప్రాజెక్టు స్థాపించిన తర్వాత గరిష్టంగా 90 ఏళ్లపాటు ఈ కరెంట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. శరవేగంగా సీలేరు ప్రాజెక్టు సీలేరులో కొత్తగా చేపట్టిన 1,350 మెగావాట్ల ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. డీపీఆర్ ఇప్పటికే సిద్ధమైందని, త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణపట్నం నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు జూలై–ఆగస్టు కల్లా వినియోగదారులకు అందనుందని పేర్కొనగా విజయవాడ థర్మల్ కేంద్రంలో కూడా 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. పోలవరం పవర్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే టన్నెళ్ల తవ్వకం పూర్తైందని, దీనివల్ల పెద్ద ఎత్తున మిగులు విద్యుత్తును సాధించగలుగుతామని అధికారులు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టు విజయవంతం శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చడం విజయవంతమైనట్లు అధికారులు తెలిపారు. 2020–21లో జిల్లాలో 26,083 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా 2021– 22 నాటికి 28,393కి పెరిగినట్లు చెప్పారు. రాష్ట్రమంతటా ఈ విధానం అమలును వేగవంతం చేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ఉచిత విద్యుత్ డబ్బులను రైతుల ఖాతాల్లోకే జమ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉచిత విద్యుత్ వినియోగానికి సంబంధించి రైతులే నేరుగా డిస్కమ్‌లకు చెల్లించడం వల్ల సేవల్లో ఎక్కడ ఇబ్బంది తలెత్తినా వెంటనే పంపిణీ సంస్థలను, సిబ్బందిని ప్రశ్నించగలుగుతారని చెప్పారు. విద్యుత్తు శాఖ కూడా రైతుల అభ్యంతరాలు, సమస్యల పరిష్కారంపై నిరంతరం ధ్యాస పెట్టగలుగుతుందని, తద్వారా జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నాణ్యమైన కరెంటు సరఫరాతోపాటు రైతులకు మంచి సేవలు అందుతాయన్నారు. చెప్పిన దానికంటే మిన్నగా వైఎస్సార్ జలకళ వైఎస్సార్ జలకళ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం సూచించారు. మేనిఫెస్టోలో కేవలం బోరు మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ మోటారు ఉచితంగా ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల విలువైన విద్యుద్దీకరణ పనులను కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. రైతులకు దీనివల్ల మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. సమీక్షలో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇంధనశాఖ కార్యదర్శి(ఎఫ్ఏసీ), ఏపీజెన్కో ఎండీ బి.శ్రీధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ ఎండీ ఎన్వి రమణారెడ్డి, డిస్కమ్‌ల సీఎండీలు తదితరులు పాల్గొన్నారు. -
బొగ్గుకూ పైసల్లేవ్!
* ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర జెన్కో * సొంత అవసరాలకు వెయ్యి కోట్ల అప్పు * బొగ్గు కొనుగోళ్ల బకాయిలు రూ.1,800 కోట్లు * సర్కారుకు ఫిర్యాదు చేసిన సింగరేణి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జెన్కో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా? రూ.42 వేల కోట్లతో భారీగా కొత్త విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తున్న జెన్కో కనీసం బొగ్గు కొనుగోలుకు డబ్బులు చెల్లించలేని దీనస్థితిలో ఉందా? సంస్థ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే విస్మయం కలిగిస్తోంది. సింగరేణి సంస్థ నేరుగా ప్రభుత్వానికే ఫిర్యాదు చేయడంతో జెన్కో డొల్లతనం బయటపడింది. బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి బకాయిపడిన రూ.1800 కోట్లు చెల్లించాలంటూ జెన్కోకు పలుమార్లు లేఖలు రాసిన సింగరేణి.. చివరకు దీనిపై రాష్ర్ట ఆర్థిక శాఖకే లేఖ రాసింది. తమ బకాయిలు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జెన్కో ప్రభుత్వ కార్పొరేషన్ కావడంతో ఆర్థిక లావాదేవీలు, ఆదాయవ్యయాలన్నీ ఆ సంస్థ పరిధిలోనే ఉంటాయి. దీంతో తాము చేసేదేమీ లేదంటూ ఆర్థిక శాఖ అధికారులు ఈ లేఖను పక్కనబెట్టారు. అయితే బొగ్గుకు డబ్బులు చెల్లించలేని విపత్కర పరిస్థితిలో జెన్కో ఉందా అనేది ఆర్థిక శాఖలో చర్చనీయాంశమైంది. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు, విద్యుత్ చౌర్యం, బిల్లుల ఎగవేత, విద్యుత్ సబ్సిడీ తదితర కారణాలతో డిస్కంలు ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయాయి. కానీ విద్యుదుత్పత్తి, అమ్మకాల ద్వారా లాభాలను ఆర్జించాల్సిన జెన్కో కూడా బొగ్గు బకాయిలను చెల్లించకపోవ డం ప్రభుత్వవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. నిర్వహణ ఖర్చులు, రోజువారీ అవసరాలకు ఆ సంస్థ ఇటీవల రూ.1000 కోట్లు అప్పు తెచ్చుకోవడం గమనార్హం. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్ఈసీ) నుంచి వర్కింగ్ కాపిటల్‌గా ఈ రుణాన్ని సమకూర్చుకుంది. వాస్తవానికి జెన్కోకు డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలున్నాయి. ఏపీలోని రెండు డిస్కంల నుంచి రూ.1660 కోట్లు, తెలంగాణలోని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ నుంచి రూ. 550 కోట్లు రావాల్సి ఉంది. కానీ అంతకంతకు సర్దుబాటు వ్యయం కూడా ఉండటంతో సంస్థ చిక్కుల్లో పడింది. అందుకే సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త విద్యుత్ ప్రాజెక్టులన్నింటికీ జెన్కో ప్రైవేటు సంస్థల రుణాలపైనే ఆశలు పెట్టుకుంది. కొత్త ప్లాంట్లకు రూ.24 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఆర్ఈసీ ఇటీవలే అంగీకరించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) కూడా రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతోపాటు ప్రభుత్వం ఈక్విటీగా సమకూర్చే రూ.3000 కోట్లను జెన్కో వినియోగించుకోనుంది. ఈ లెక్కన జెన్కో రుణాలు, ప్రభుత్వ ఈక్విటీపైనే ఆధారపడ్డట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.