కేఎఫ్‌సీ భోజనంలో పురుగులు!
కేఎఫ్‌సీ.. తన వినియోగదారులకు షాకుల మీద షాకులిస్తోంది. సాయంత్రం సరదాగా అలా బయట తిందామని వెళ్లిన వారికి కేఎఫ్‌సీ పాప్‌కార్న్ చికెన్ మీల్లో పురుగులు కనిపించడంతో ఆశ్చర్యం, అసహ్యం రెండూ కలిగాయి. ఇటీవలి కాలంలో కేఎఫ్‌సీ మీద పలు సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఇండియాలో హైదరాబాద్, మంగుళూరు తదితర ప్రాంతాల్లో కేఎఫ్‌సీ బర్గర్లలో పురుగులు రావడం, చికెన్‌లో బ్యాక్టీరియా ఉండటం కనిపించాయి.
తాజాగా 27 ఏళ్ల జెన్నిఫర్ ఆల్డెర్సన్ తన కుమార్తె లిడియా హోనేతో కలసి బిషప్ ఆక్లాండ్ లోని దుర్హామ్ ప్రాంతంలో ఉన్న కేఎఫ్‌సీకి వెళ్లారు. అక్కడ చికెన్ పాప్‌కార్న్ మీల్ కోసం ఆర్డర్ ఇచ్చారు. తీరా లిడియా తింటున్న పాప్‌కార్న్‌లో పురుగు కనిపించడంతో జెన్నిఫర్ షాకయ్యింది. ఒకేవారంలో ఇలా కేఎఫ్‌సీ ఆహారంలో క్రిములు కనిపించడం ఇది రెండోసారని అక్కడే ఉన్న మరో మహిళ చెప్పడం.. అగ్నికి ఆజ్యం పోసింది.
పురుగు కనిపించిన తర్వాత జెన్నిఫర్ కుటుంబ సభ్యులు.. మిగిలిన పదార్థాలను తినలేకపోయారు. పదార్థాలన్నింటినీ వాపస్ ఇచ్చేసిన ఆల్డెర్సన్.. కేఎఫ్‌సీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదార్థాలను చుట్టి ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత పురుగులు ఎలా వస్తాయని, మీ అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందని మండిపడింది. దీంతో కేఎఫ్‌సీ సిబ్బంది మరోసారి ఇలా జరగకుండా చూస్తామంటూ క్షమాపణలు చెప్పారు..
అయితే మొక్కజొన్న వంటి సహజ ఉత్పత్తుల విషయంలో దురదృష్టవశాత్తు అరుదుగా ఇలా అవుతుందని, గింజలను తొలిచి క్రిములు లోపల ఉండటంతో కనపడవని కేఎఫ్‌సీ సిబ్బంది సంజాయిషీ ఇస్తున్నారు. ఇలాంటి తప్పులు జరిగితే తాము ఆర్డర్ పూర్తిగా వాపస్ తీసుకుంటామని, తమ కస్టమర్ కేర్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తారని చెప్తున్నారు. ఆహార భద్రతాధికారులు కూడా ఒకే వారంలో రెండుసార్లు ఇలాంటి ఘటనలు జరగడంపై కేఎఫ్‌సీని వివరణ కోరారు.