ఫ్లైట్‌లో మహిళను కొట్టి.. కాక్‌పిట్‌ను తన్ని..
బీజింగ్: రోడ్లే కాదు.. బస్సుల్లోనే కాదు.. విమానాల్లో కూడా అల్లరి చిల్లరిగా గొడవపడేవాళ్లు తయారువుతున్నారు. ఎంతో క్రమ శిక్షణగా ఉండాల్సిన ఫ్లైట్‌లో ఫైట్లకు తెరతీస్తున్నారు. విమాన సిబ్బందిపై దాడి చేయడం నుంచి తోటి ప్రయాణీకులపై ఆఖరికి కాక్ పీట్లోకి దూసుకెళ్లే వరకు చేస్తున్నారు. ఈ ఆందోళనకరమైన పరిస్థితి ఇప్పుడు చైనాకు తలనొప్పిగా మారుతుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రయాణికుడు విమాన ప్రయాణంలో అసౌకర్యం కలిగించే చర్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా, టాక్సియింగ్కు బయలుదేరేందుకు సిద్ధమైన విమానంలో ఇద్దరు వ్యక్తులు విమాన సిబ్బందితో గొడవ పడ్డారు.
మహిళ అని కూడా చూడకుండా ఆమెపై పిడిగుద్దులు కురిపించి రక్తం కళ్ల చూశారు. ఇదేమిటని ప్రశ్నించిన తోటి ప్రయాణికుడిని కాక్ పీట్ కేసి కొట్టడమే కాకుండా కాక్ పీట్ ను పదే పదే తన్నారు. దాటోంగ్ నుంచి చాంకింగ్కు వెళ్లేందుకు వచ్చిన ఆ ఇద్దరు బిజినెస్ క్లాస్‌లోకి అప్‌గ్రేడ్ చేసుకునేందుకు విఫలమైన క్రమంలో ఈ దాడికి పాల్పడ్డారు. పోలీసులు వచ్చేంత వరకు కూడా వారు ఇదే బీభత్సం చేశారు. చివరకు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవల వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దాడులకు పాల్పడుతున్న ప్రయాణీకుల వివరాలన ఫొటోలతో సహా విమానయాన సంస్థ తన ఆన్లైన్ విభాగంలో పెట్టింది.