కొత్త స్టేట్.. కొత్త కోడ్
సాక్షి, కాకినాడ :వాహనాలపై కోడ్‌ను బట్టి అది ఏ రాష్ర్టంలో ఏ జిల్లాకు చెందిందో ఇట్టే చెప్పవచ్చు. ఇప్పటి వరకూ 23 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను ‘ఏపీ’గా పరిగణించి, జిల్లాలను ఆంగ్లాక్షరక్రమాన్ని అనుసరించి అంకెల్లో పేర్కొంటు న్నారు. ఉమ్మడి రాష్ర్టంలో అక్షరక్రమంలో అనంతపురం, ఆదిలాబాద్, చిత్తూరు, కడపల తర్వాత తూర్పు గోదావరి నిలిచేది. అందుకు అనుగుణంగా మన జిల్లా కోడ్ ఏపీ 05గా ఉంది. వాహనం నంబర్లో ఏపీ-05 అనేది చూడగానే అది తూర్పు గోదావరి జిల్లాకు చెందిందని ఠక్కున చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలు కానున్న నేపథ్యంలో మన జిల్లా కోడ్ ఏపీ-05 నుంచి ఏపీ-04గా మారనుంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడ నుండడంతో మిగిలిన 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)కు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను నిర్ణయించనున్నారు. దీని ప్రకారం అక్షరక్రమంలో అనంతపురం, చిత్తూరు, కడపల తర్వాత వచ్చే తూర్పుగోదావరి కోడ్ ఏపీ-04గా మారనుంది. జూన్ 2 నుంచి జిల్లాలో రిజిస్టరయ్యే వాహనాలకు కోడ్‌నే వినియోగిస్తారు.
ఆ మూడురోజులూ వాహనాల అమ్మకాలూ బంద్ వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల ద్వారా వచ్చే ఆదాయం ఇప్పటి వరకూ హైదరాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయానికి జమయ్యేది. కొత్త ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ కార్యాలయాన్ని కొత్త రాజధాని ఏర్పడే వరకు హైదరాబాద్‌లోనే తాత్కాలికంగా ఏర్పా టు చేస్తున్నారు. జూన్ 2 నుంచి ఈ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏ రాష్ర్ట పరిధిలోని జిల్లాల ఆదాయం ఆ రాష్ట్రానికి జమయ్యేందుకు వీలుగా ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండువరకు వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల జారీని నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మూడు రోజులూ వాహనాల అమ్మకాలను నిలిపి వేయాలని డీలర్లను కూడా ఆదేశించింది. తిరిగి జూన్ 3 నుంచి కొత్త కోడ్‌తో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.