జ్వరాల నివారణకు 30 వైద్య బృందాలు
– కలెక్టర్ భాస్కర్
ఏలూరు (మెట్రో) : జిల్లాలో మలేరియా జ్వరాల నివారణ, దోమల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు అక్కడికక్కడే వైద్య చికిత్స అందించేందుకు 30 వైద్య బందాలను నియమించినట్టు జిల్లా కలెక్టర్ భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో వైద్యాధికారులు, పంచాయతీ, డ్వామా, డీఆర్డీఏ, విద్యాశాఖాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ప్రజారోగ్యంపై సమగ్రంగా సమీక్షించారు. మలేరియా, డెంగీ, గన్యా, డయేరియా, టైఫాయిడ్, స్వైన్ ఫ్లూ అంటు వ్యాధులను నూరుశాతం నిరోధించేందుకు ప్రతి ఒక్కరినీ చైతన్య పరిచి అవగాహన పరచాలన్నారు. దీని కోసం జిల్లాలో ఐదు రోజుల పాటు ప్రత్యేక వ్యాధి నిరోధక, పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు అందిస్తున్న సేవలను కొనసాగింపుగానే ఈ ప్రత్యేక వైద్య బందాలు పనిచేస్తాయన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రై వేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించినట్టు తెలిస్తే సంబంధిత యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి పీహెచ్సీలో యాంటీ మలేరియా మందులు, పాముకాటు నివారణ మందులు సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 21, 22, 23, తేదీల్లో అన్ని మునిసిపాలిటీలు, పంచాయతీల్లో, పారిశుధ్య కార్యక్రమాలను ఉద్యమ రూపంలో చేపడుతున్నట్టు కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, డీపీవో కె.సుధాకర్, డీసీహెచ్ఎస్ శంకరరావు, డీఎంహెచ్‌వో కె.కోటేశ్వరి, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, డీఈవో డి.మధుసూదనరావు పాల్గొన్నారు.
ప్రతి రోజూ క్లోరినేషన్ చేయండి
ప్రజారోగ్యాన్ని దష్టిలో ఉంచుకుని గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులు, వనరులు కలుషితం కాకుండా ప్రతి రోజూ క్లోరినేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 21వ తేదీ నుంచి 26 వరకూ నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంపై సమీక్షించారు. తాగునీటి పైపులైన్ సంబంధించి లీకేజీలు ఉంటే, తాగునీటి విషయంలో ఎమైనా లోపాలు కనిపిస్తే సమస్య పరిష్కారానికి 08812–222891 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.