ఎంసెట్ కౌన్సెలింగ్ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ లేకపోవడమంటే ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు తెలంగాణాలో ని 174 కళాశాలలకు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్ వర్తిస్తుందని బుధవారం తీర్పు ఇవ్వడంపై వారి అభిప్రాయాలు.
-కురబలకోట
పరిశీలించాలి
సుప్రీం కోర్టు తీర్పు నిరాశ కలిగించింది. కౌన్సెలింగ్పై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌన్సెలింగ్లో ఓ కళాశాలలో చేరి అది ఇష్టపడక మరో కళాశాలకు వెళ్లాలనుకున్న వారికి ఇక చాన్స్ ఉండదు. మొదటి విడత కౌన్సెలింగ్ కూడా అస్తవ్యస్తంగా సాగింది.
-ఎం.అమరావతి, డెరైక్టర్, విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కళాశాల, అంగళ్లు
ప్రభుత్వం చొరవ చూపాలి
రాష్ట్ర ఎంసెట్ విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్ లేకపోవడం ఒక విధంగా రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యమే. తన వాదనను గట్టిగా వినిపించకపోవడం వల్లే ఇలా జరిగిందని భావించాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే మరో పిటిషన్ దాఖలు చేయాలి. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడాలి.
-ఎన్వీ.రమణారెడ్డి, కరస్పాండెంట్, గోల్డన్వ్యాలీ ఇంజనీరింగ్ కళాశాల, అంగళ్లు
ఏడాది నష్టపోవాల్సిందేనా
ఇప్పటికే ప్రారంభమైన డిగ్రీలో చేరలేక రెండో విడత కౌన్సెలింగ్ లేక విద్యార్థులు అవస్థల పాలయ్యారు. మేనేజ్మెంట్లో చేరడానికి ఆర్థిక స్థోమత లేనివారు సంవత్సర కాలాన్ని పోగొట్టుకోవాల్సి వస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సెలింగ్కు అవకాశం కల్పించాలి.
-మారుతీ ప్రసాద్, పీఆర్వో, మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, అంగళ్లు