వెంగ్‌సర్కార్‌కు ‘జీవితకాల సాఫల్య’ పురస్కారం
ఉత్తమ క్రికెటర్‌గా భువనేశ్వర్ బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రకటన
ముంబై: ప్రతిష్టాత్మక ‘కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య’ పురస్కారం... ఈసారి భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌కు దక్కింది. మంగళవారం ప్రకటించిన బీసీసీఐ వార్షిక అవార్డుల్లో పేసర్ భువనేశ్వర్ కుమార్.. ఉత్తమ అంతర్జాతీయ భారత క్రికెటర్ (పాలి ఉమ్రిగర్ ట్రోఫీ)గా ఎంపికయ్యాడు. ఈనెల 21న ముంబైలో ఈ అవార్డులను విజేతలకు అందజేస్తారు.
1976 నుంచి 1991 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించిన వెంగ్‌సర్కార్ పేరును శేఖర్ గుప్తా (మీడియా), శివలాల్ యాదవ్ (బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు), సంజయ్ పటేల్ (కార్యదర్శి)లతో కూడిన కమిటీ ప్రతిపాదించింది. ఈ అవార్డు కింద రూ. 25 లక్షల నగదు, ప్రశంసా పత్రం, ప్రతిమను బహుకరించనున్నారు. భువనేశ్వర్‌కు రూ. 5 లక్షల నగదు, ప్రశంసా పత్రం, ప్రతిమను అందజేయనున్నారు.
ఇతర అవార్డుల విజేతలు
రంజీల్లో ఉత్తమ ఆల్‌రౌండర్ (లాలా అమర్నాథ్ అవార్డు) : పర్వేజ్ రసూల్
వన్డేల్లో ఉత్తమ ఆల్‌రౌండర్ (లాలా అమర్నాథ్ అవార్డు): ఆర్. వినయ్ కుమార్
రంజీల్లో అత్యధిక స్కోరు (మాధవరావు సింధియా అవార్డు) : కేదార్ జాదవ్
రంజీల్లో అత్యధిక వికెట్లు (మాధవరావు సింధియా అవార్డు) : రిషీ ధావన్
ఉత్తమ అండర్-25 క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) : రాహుల్ త్రిపాఠి
ఉత్తమ అండర్-19 క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) : అనిరుధ్
ఉత్తమ అండర్-16 క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) : శుభమ్ గిల్లా
ఉత్తమ జూనియర్ మహిళా క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) : స్మృతి మందన
దేశవాళీ ఉత్తమ అంపైర్ : అనిల్ చౌదరి
అనిరుధ్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అవార్డుల్లో అండర్-19 అత్యుత్తమ ఆటగాడిగా హైదరాబాద్‌కు చెందిన బాలచందర్ అనిరుధ్ ఎంపికయ్యాడు. 2013-14 సీజన్లో కూచ్ బెహర్ ట్రోఫీలో 11 ఇన్నింగ్స్‌లో అతను 909 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 232. చెన్నైలో పుట్టిన అనిరుధ్ హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ అకాడమీలోనే క్రికెట్ నేర్చుకున్నాడు. హైదరాబాద్ తరఫున అండర్-13, అండర్-16, అండర్-19, అండర్-22, అండర్-25 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
ఈ సంవత్సరం అండర్-19 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు ప్రాబబుల్స్‌లో కూడా తను ఉన్నాడు. ఈ సీజన్లో రెండు నెలల పాటు జాతీయ క్రికెట్ అకాడమీలో (ఎన్సీఏ)లో బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక శిక్షణా శిబిరానికి కూడా అనిరుధ్ హాజరయ్యాడు గత ఏడాది హైదరాబాద్ సీనియర్ వన్డే, టి20 జట్లకు ఎంపికైనా... తుది జట్టులో అవకాశం రాలేదు.
‘నేను అవార్డుకు ఎంపికైనట్లు బీసీసీఐనుంచి సోమవారం సమాచారం అందింది. అండర్-19లో టాప్ స్కోరర్‌కు అవార్డు ఇస్తారని తెలుసు. నేను చేసిన పరుగులు తెలుసు కాబట్టి నాకే వస్తుందని ఊహించాను. దీనికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో నేను మరింతగా రాణించేందుకు ఇది ప్రోత్సాహకంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఈ సీజన్లో హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. తుది జట్టులో చోటు లభిస్తే సత్తా చాటుతా’ - ‘సాక్షి'తో అనిరుధ్