కలర్‌ఫుల్ మార్కెట్
‘ఆ రెస్టారెంట్‌కి జస్ట్ ఫైవ్ మినిట్స్ టైంపాస్ చేద్దామని వెళ్లాను. అదేంటో అక్కడికెళ్లాక భలే ఆకలేసేసింది. తినకుండా ఉండలేకపోయా’ అంటూ చెప్పే మాటలు వింటుంటాం. సిటీలో వెళ్తుంటే ఒక షోరూంచూశారు. అప్రయత్నంగానే లోపలకి వెళ్లారు.
మీకు తెలుసా? ముందస్తు ఆలోచన లేకుండా మిమ్మల్ని అటువైపు మళ్లేలా చేసింది షోరూమ్ ఎంట్రన్స్‌లో ఉన్న ఎట్రాక్టివ్ కలర్ అని. కన్సూమర్స్ని అట్రాక్ట్ చేయడానికి మార్కెటింగ్ నిపుణుల ప్రధాన అస్త్రాలవి. మనం వాడే ప్రతి ఉత్పత్తి, పొందుతున్న ప్రతి లగ్జరీ మనల్ని ఆకట్టుకునే రంగుల్ని... కట్టుకునే మనల్ని కట్టిపడేస్తున్నాయి.
ఎస్.సత్యబాబు
నవ వసంతాన్ని పక్షం ముందుగానే రంగులతో స్వాగతించే పండుగ హోలీ. మానవ జీవితం రంగులతో పెనవేసుకుపోయింది. మనిషి మాత్రమే రంగులను ఆస్వాదించగలడు. రంగుల మీద ఆ ఇష్టమే మార్కెటింగ్ నిపుణులకు వరంగా మారుతోంది. ఉత్పత్తిదారులు వర్ణాస్త్రాలకు పదును పెట్టేందుకు దోహదం చేస్తోంది.
రంగులలో కలదు..
జోయ్ హల్లోక్ కలర్ అసైన్మెంట్స్ స్టడీ ప్రకారం బ్లూ కలర్ స్త్రీ, పురుషులు ఇద్దరూ ఇష్టపడే రంగుగా వెలుగుతోంది. పురుషులు అత్యధికంగా ఇష్టపడే రంగుల్లో బ్లూ 57 శాతం, గ్రీన్ 14 శాతం, బ్లాక్ 9 శాతంగా ఉంటే, మహిళల్లో బ్లూని 35 శాతం, పర్పుల్ 23 శాతం, గ్రీన్ 14 శాతం ఇష్టపడతారు. ఇక పురుషులు అత్యధికంగా ద్వేషించే రంగుల్లో బ్రౌన్ 27 శాతం, ఆరెంజ్ 22 శాతం, పర్పుల్ 22 శాతంగా ఉన్నాయి. ఇక మహిళలు ఆరెంజ్‌ని 33 శాతం, బ్రౌన్‌ని 20 శాతం, గ్రీన్ 17 శాతం మంది ద్వేషిస్తారు. చాలా వరకూ మార్కెటింగ్ సూత్రాలు ఈ తరహా సర్వేల ఆధారంగానే రూపొందుతున్నాయి. మహిళలను, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకునే ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం పింక్ రంగులో ఉంటాయనేది వేరే చెప్పనక్కర్లేదు. దాదాపు 90 శాతం వస్తువుల ఎంపిక కలర్స్‌ని బట్టే జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
సిగ్నల్స్ టు రెస్టారెంట్స్...
ఇంట్లోంచి అడుగు బయట పెట్టిన దగ్గర్నుంచి మనల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసేవి రంగులే. ట్రాఫిక్ సిగ్నల్స్‌లో వెలిగే రెడ్, గ్రీన్ల గురించి సిటీవాసులకు చెప్పక్కర్లేదు. ఇక మనలో తిండిపై ఇష్టాన్ని ప్రేరేపించే శక్తి ఎల్లోకు ఉందని చెబుతారు. అందుకే చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్, ఇంకా పలు రకాల ఆహారోత్పత్తులకు అంత డిమాండ్. దీనిని దృష్టిలో ఉంచుకునే సిటీలోని పలు రెస్టారెంట్స్‌లో ఎల్లోని ఏదో ఒక రూపంలో భాగం చేస్తున్నారు. ఉదాహరణకు మెక్‌డొనాల్డ్ ఆర్చ్‌లు, పిజ్జాహట్ బోర్డ్స్. అంతేకాకుండా ఎల్లో ఆప్టిమిస్టిక్ కలర్. విండో షాపర్స్‌ను అట్రాక్ట్ చేసే విషయంలోనూ దీన్ని బాగా వినియోగిస్తున్నారు.
రెడ్‌కలర్ ఎనర్జిటిక్. హార్ట్‌రేట్‌ని పెంచుతుంది. యూత్‌ని లక్ష్యంగా చేసుకున్న పిజ్జా సెంటర్లు, కాఫీడేలు, కెఎఫ్సీ.. వంటివి ఎర్రని రంగులున్న బోర్డ్స్‌తో ఆహ్వానిస్తుంటాయి. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌కు ఆరెంజ్, ఎల్లో, రెడ్ కలర్స్ వినియోగిస్తే.. అవి ఆహారప్రియత్వాన్ని మాత్రమే కాకుండా వేగంగా తినే తత్వాన్ని కూడా ప్రేరేపిస్తాయన్న నిపుణుల సలహాలను బ్రాండెడ్ ఔట్లెట్స్ అక్షరాలా పాటిస్తున్నాయి. అదే హైక్లాస్ రెస్టారెంట్స్ విషయానికి వస్తే అటు ఆకలిని, ఇటు రిలాక్సయిన భావనను ఒకేసారి కలిగించాలి కాబట్టి.. పీచ్, యాప్రికాట్, క్రీమ్, ఆరెంజ్‌లో వేరియేషన్స్ లీడ్ చేస్తున్నాయి.
డిఫరెంట్ షేడ్స్..
బ్లూ కలర్ విశ్వసనీయతకు గుర్తుగా భావిస్తారు. అందుకే మెజారిటీ సెక్యూరిటీ గార్డ్స్ టీమ్ బ్లూగా కనిపిస్తున్నారు. పర్పుల్ అనేది కామ్‌నెస్, ప్రశాంతత కోరుకునేవారిని ఆకర్షించే రంగు. సిటీలోని బ్యూటీపార్లర్స్, ఏజింగ్ ప్రొడక్ట్స్‌కు ఈ కలర్ వాడడానికి ఇదో కారణం. శక్తివంతమైన ఫీలింగ్‌ని బ్లాక్ అందిస్తుందని, పవర్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలనుకునేవారిని ఎట్రాక్ట్ చేయడం కోసం దీనిని ఎక్కువ వాడతారు. బైక్స్, మద్యం బాటిల్స్ కలర్స్‌ని చూస్తే ఈ కలర్ టెక్నిక్‌ని వాళ్లు ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు. గ్రీన్ ఫీల్డ్ మార్కెటింగ్ లేదా గ్రీన్ మార్కెటింగ్ ఇప్పుడు సిటీలో లేటెస్ట్ బజ్.
కలర్‌తో ‘స్పా’ట్...
కలర్ థెరపీకి సిటీ ‘స్పా’లు తెగ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ‘మరీ బ్రైట్‌గా కాకుండా మరీ డార్క్‌గా కాని మధ్యస్థపు కాంతితో కనిపిస్తేనే వినియోగదారులు స్పా ఫీల్‌ను ఎంజాయ్ చేయగలరు. అందుకే ప్రత్యేకమైన లైట్ కలర్స్ వినియోగించాం’ అని జూబ్లీహిల్స్‌లోని స్పా యజమాని చెప్పారు. అలాగే జిమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేసే చోట కామింగ్ కెమికల్స్‌ను ప్రేరేపించేందుకు బ్లూ షేడ్స్ వాడతున్నారు. ‘బ్లూ షేడ్ వల్ల వెయిట్స్‌ని మరికాస్త సులభంగా లిఫ్ట్ చేయవచ్చునని రీసెర్చ్ ఫలితాలు వెల్లడించాయి’ అని సిటీ ట్రైనర్ ఒకరు చెప్పారు. నిద్రమత్తుని నిరోధించే గుణం కూడా బ్లూకి ఉంది. ఫన్ కావాలంటే ఫిట్నెస్ రూమ్‌కి ఆరెంజ్ యాడ్ చేస్తారు. యోగా కేంద్రాల విషయానికి వచ్చేసరికి కామింగ్ కలర్ అవసరం. ఓషన్ బ్లూస్, గ్రాస్ కలర్డ్ గ్రీన్‌ని వినియోగిస్తున్నారు. ఇవి పీస్ఫుల్ ఫీల్‌ని అందిస్తాయని యోగా సెంటర్స్ భావిస్తున్నాయి.
కలర్‌ఫుల్ టెక్నిక్..
కలర్‌కి మన మనసుల్ని నియంత్రించే శక్తి ఉందని ప్రూవ్ అయిన సంగతే. మార్కెటింగ్‌లో దీనిని ప్రధాన అస్త్రంగా చేసుకోవడానికి కారణమిదే. కోలా లాంటి సాఫ్ట్ డ్రింక్స్ దగ్గర్నుంచి
లాటమాటినా లాంటి ఈవెంట్ వరకూ సూపర్‌హిట్ అవడానికి ప్రధాన కారణం కలర్.
సిటీలోనే కాదు ఎక్కడైనా కలర్ అనేది
మార్కెటింగ్‌కు అత్యంత అవసరమైన అంశం.
- అనిల్ రమేష్, మార్కెటింగ్ ప్రొఫెసర్