అంతరిక్షంలో మన నక్షత్రం!
అది 2003వ సంవత్సరం జనవరి 16వ తేదీ. అమెరికాలోని కెన్నడీ స్పేస్‌సెంటర్‌లో కౌంట్‌డౌన్ మొదలయింది. కొలంబియా అంతరిక్ష నౌక (స్పేస్ షటిల్) నింగిలోకి ఎగరడానికి సమయం దగ్గరపడుతోంది. క్రూ క్యాబిన్లో ఏడుగురు వ్యోమగాములు విజయకేతనం ఎగురవేస్తున్నట్లు బొటనవేలిని పైకి లేపారు. అలా పైకి లేచిన చేతుల్లో ఒకటి కల్పనాచావ్లాది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పన.
హర్యానాలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన కల్పన ఆలోచనలు ఎప్పుడూ అసాధారణంగానే సాగేవని చెప్పేది ఆమె తల్లి సంజ్యోతి చావ్లా. కల్పనకు కరాటే ఇష్టం, జుట్టును కత్తిరించుకోవడం ఇష్టం, ఫ్లయింగ్ ఇష్టం, తొలి భారతీయ పైలట్ జెఆర్‌డి టాటా ఆమె రోల్ మోడల్. ఆ కలలతోనే ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు.
అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా)లో ఉద్యోగం సంపాదించారు. నాసాలో చేరిన రెండేళ్లకు... అది 1997 నవంబరు 19, కొలంబియా ఎస్టిఎస్- 87 వాహకనౌకలో కల్పన తొలిసారి అంతరిక్షయానం చేశారు. దాదాపు ఐదునెలలపాటు అంతరిక్షంలో సాగిన అధ్యయనంలో భాగంగా ఆమె పదకొండు మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. 252సార్లు భూమిని చుట్టారు. తర్వాతి ప్రయాణం కొలంబియా ఎస్టిఎస్- 107 అంతరిక్షనౌకలో. ఇది కల్పన తొలి అంతరిక్ష పర్యటనలా నెలలపాటు సాగలేదు. నిండా పదిహేను రోజుల పర్యటన. జనవరి నెల పూర్తయింది. తిరిగి భూమిని చేరాల్సిన రోజు రానే వచ్చింది. అది ఫిబ్రవరి ఒకటవ తేదీ. కక్ష్య నుంచి భూవాతావరణంలోకి వస్తున్నామనే భావన వ్యోమగాములను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇక 16 నిమిషాలలో భూమిని చేరాలి. ఇంతలో హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్లోని ఇంజనీర్లతో కొలంబియా స్పేస్‌షటిల్‌కి సిగ్నల్స్ తెగిపోయాయి. జరగకూడనిదేదో జరగనుందని గ్రహించేలోపే కొలంబియా అంతరిక్ష నౌకలో పేలుడు. గాల్లో సంభవించిన పేలుడు ఏడుగురు వ్యోమగాముల ప్రాణాలను గాల్లో కలిపేసింది.
ప్రపంచదేశాలకు ఇది సాంకేతిక లోపంగానే కనిపించింది. అమెరికాకు తమ విజ్ఞానం
మీద సందేహం కలిగింది. భారత్‌కు మాత్రం బిడ్డను బలితీసుకున్న ప్రయాణంగా చేదును మిగిల్చింది. కర్నాల్ వాసులు ఇప్పటికీ ఆకాశాన్ని చూపిస్తూ ‘ఆ కనిపించే నక్షత్రమే మా కల్పన,
ఎవరికీ అందనంత ఎత్తుకెదిగింది’ అంటారు మెరుస్తున్న కళ్లతో.
హారిసన్ గురించి: కల్పన మరణానంతరం ఆమె జీవిత చరిత్రను రాశారు.
ఆ పుస్తకం పేరు ‘ద ఎడ్జ్ ఆఫ్ టైమ్’. ఆ పుస్తకాన్ని కల్పన చదువుకున్న పంజాబ్
ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఆవిష్కరించారు. కల్పన బాల్యం గురించి ఆమెకు తెలిసిన
వారందరితో మాట్లాడి ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు హారిసన్.
కల్పనాచావ్లా గురించి...
పుట్టిన తేదీ: 1962, మార్చి 17
సొంత ఊరు: కర్నాల్ (హర్యానారాష్ట్రం)
అమ్మానాన్నలు: బనారసీలాల్ చావ్లా, సంజ్యోతి చావ్లా
అక్కలు, అన్న: సునీత, దీప, సంజయ్
ప్రాథమిక విద్య: కర్నాల్‌లోని టాగూర్ పబ్లిక్ స్కూల్
ఉన్నత విద్య: చండీఘర్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్, అమెరికా, ఆర్లింగ్టన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్, యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పిహెచ్డి.
కెరీర్: 1995 మార్చిలో నాసాలో వ్యోమగామిగా
భర్త: జీన్ పీయరి హారిసన్(ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, కల్పనాచావ్లాకి స్కూబాడైవింగ్,
హైకింగ్, లాంగ్ఫ్లయింగ్లలో శిక్షణ ఇచ్చారు), పెళ్లయింది-1988లో.