బట్టతలకు కొత్త ఔషధాలు!
న్యూయార్క్: బట్టతల నివారణకు ఓ సరికొత్త ఔషధాలు సిద్ధమవుతున్నాయి. వెంట్రుకల పెరుగుదలను బాగా పెంచి బట్టతల రావడాన్ని నియంత్రించే ఈ ఔషధాలను అమెరికాకు చెందిన కొలంబియా వర్సిటీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్త ఏంజిలా క్రిస్టియానో నేతృత్వంలోని పరిశోధకులు రూపొందించారు. వెంట్రుకల పెరుగుదల నిలిచిపోయిన చోట చర్మంలో ఉండే వెంట్రుకల మూలాలలో ‘జానస్ కినాసే (జేఏకే)’ తరహాకు చెందిన ఎంజైమ్లు ఉంటాయని.. వీటిని నిరోధించినప్పుడు తిరిగి వెంట్రుకలు వేగంగా పెరుగుతున్నట్లుగా గుర్తించామని ఏంజిలా చెప్పారు.
ఈ ఎంజైమ్లను నియంత్రించే ఔషధాలను అభివృద్ధి చేశామని.. వాటిని మనుషులపై ఇప్పటికే ప్రయోగించి చూడగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ ఔషధాలను నేరుగా చర్మంపై రాసుకుంటే సరిపోతుందన్నారు. పలు ఇతర వ్యాధుల బారిన పడినప్పుడు వెంట్రుకలు రాలిపోవడాన్ని ఈ మందులు నియంత్రిస్తాయన్నారు.