ఔటర్ వరంగల్
70 -కి.మీ. మేర ఔటర్ రింగ్ రోడ్డు
29- కి.మీ.రోడ్డును ఎన్హెచ్ఏ..
41- కి.మీ.రోడ్డు అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
2014- మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదన
రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన ఓరుగల్లుకు మహర్దశ పట్టనుంది. మహానగర పాలక సంస్థ దిశగా దూసుకెళ్తున్న వరంగల్ నగరం చుట్టూ 70 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజన్-2031 కొత్త మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతోపాటు ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మిస్తామని సీఎం వెల్లడించిన నేపథ్యంలో జిల్లావాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు గతంలో వరంగల్‌లోని ఖమ్మం రోడ్డు నుంచి ములుగు రోడ్డు వరకు ‘కుడా’ చేపట్టిన ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణంతో వరంగల్ దశాదిశ మారనుంది.
వరంగల్ అర్బన్ : విజన్-2031లో భాగంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) రూపొందించిన బృహత్తర ప్రణాళిక తో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ఈ ఏడాది జనవరిలో ‘కుడా’ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం ఇది సీఎం పేషీలో ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. కొత్త మాస్టర్ ప్లాన్‌లో.. గతంలో ప్రతిపాదించిన ఖమ్మం రోడ్డు నాయుడు పెట్రోల్ పంపు నుంచి ములుగు రోడ్డు వరకు ఉన్న ఇన్నర్ రింగ్‌రోడ్డుతోపాటు నూతనంగా ఔటర్ రింగ్‌రోడ్డు కోసం ప్రతిపాదనలు రూపొందించారు. హైదరాబాద్ హైవే నుంచి నగరం నలుదిశలా ఉన్న రోడ్లను కలుపుతూ మళ్లీ హైదరాబాద్ రహదారిలోని రాంపూర్ వరకు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు.
ఈ రోడ్డుకు అనుసంధానంగా కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, అగ్రికల్చర్ జోన్, గ్రీన్‌బెల్ట్ జోన్, హెరిటేజ్ జోన్, విద్యాభవనాల జోన్లను ప్రత్యేకంగా విభజించారు. వరంగల్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం జనాభా 8.19లక్షలు దాటిపోయింది. వచ్చే 20 ఏళ్లలో 12లక్షలకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉండడంతో ‘కుడా’ ఈ మాస్టర్ ప్లాన్-2014కు రూపకల్పన చేసింది. ఈ ప్రణాళికపై సీఎం కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేయడంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
శివారు ప్రాంతాలను కలుపుతూ..
ఔటర్ రింగ్‌రోడ్డు ప్రతిపాదన మొత్తం 70 కిలోమీటర్లు కాగా అందులో 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల శాఖ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ట్రైసిటీ నుంచి నేషనల్ హైవే 202 ఉంది. హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇదే ప్రాజెక్టులో భాగంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట(ట్రైసిటీ)లోకి రాకుండా శివారు ప్రాంతాల నుంచి 29 కిలోమీటర్లను చేర్చితే లాభదాయకంగా ఉంటుందని భావించిన అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్,‘కుడా’ వైస్ చైర్మన్ వాకటి కరుణ చొరవతో రోడ్డును నిర్మించేందుకు అంగీకరించారు. శాటిలైట్ సర్వే ప్రక్రియ కూడా పూర్తయింది. ములుగురోడ్డు నుంచి నర్సంపేట రోడ్డు, ఖమ్మం రోడ్డు మీదుగా హైదరాబాద్ హైవే వరకు రోడ్డు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ‘కుడా’ ఆధ్వర్యంలో చేపడతారు. ఈరోడ్డు పొడవు మొత్తం 41కిలోమీటర్లు.
‘ ఔటర్’ ఇలా...
హైదరాబాద్-వరంగల్ హైవే రోడ్డులోని రాంపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈరోడ్డు మడికొండ, టేకులగూడెం, ఉనికిచర్ల, దేవన్నపేట,చింతగట్టు, భీమారం, పలివేల్పుల, వంగపహాడ్, ఆరేపల్లి సమీపంలోని దామెర క్రాస్ నుంచి ములుగు రోడ్డుకు కలుస్తుంది. ఈ రోడ్డును నేషనల్ హైవే శాఖ నిర్మిస్తుంది.
ములుగు రోడ్డు నుంచి కొత్తపేట, మొగిళిచర్ల, బొడ్డుచింతలపల్లి, కోటగండి, వంచనగిరి, వెంకటాపురం, బొల్లికుంట, మామునూరు ఎయిర్ పోర్టు సమీపం నుంచి సింగారం, ఐనవోలు, వెంకటాపురం, ధర్మపురం మీదుగా రాంపూర్ వద్ద హైదరాబాద్ జాతీయ రహదారికి అనుంధానం అవుతుంది. ఈ రోడ్డు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ చేపట్టనుంది.
బైపాస్ రోడ్డుగా..ఇన్నర్ రింగ్‌రోడ్డు
ఖమ్మం రోడ్డులోని నాయుడు పెట్రోల్ పంపు నుంచి ఖిలా వరంగల్ తూర్పు కోట, జనీపీరీలు, ఏనుమాముల, పైడిపల్లి శివారు మీదుగా ములుగు రోడ్డు అయ్పప్పస్వామి దేవాలయం వరకు 1972 మాస్టర్ ప్లాన్‌లో ఇన్నర్ రింగ్ రోడ్డును పొందుపరిచారు. ‘కుడా’ తాజా మాస్టర్ ప్లాన్‌లో ఔటర్ రింగ్‌రోడ్డును డిజైన్ చేయడంతోపాటు ఈ రోడ్డును ఇన్నర్ రింగ్‌రోడ్డుగా లేదంటే బైపాస్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.20 కోట్లతో రెవెన్యూ అధికారుల సహకారంతో భూసేకరణకు సిద్ధమవుతున్నారు.
బోలెడన్ని లాభాలు
ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో పరిశ్రమ,సేవా రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి.
జాతీయ, ఆర్అండ్బీ రహదారులతో అనుసంధానం చేస్తే రవాణా వ్యవస్థ బలోపేతమవుతుంది.
అవసరమైనచోట బైపాస్‌లు, ఓవర్ బ్రిడ్జిలు నిర్మించడంతో ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది.
వాహనాలు ఔటర్‌రింగ్‌రోడ్డు ద్వారా వెళ్లడంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి.
పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకొస్తాయి.