దివీస్ బాధితులకు మద్దతుగా 22న జగన్ పర్యటన
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
బహిరంగ సభను జయప్రదం చేయండి
తుని రూరల్ :
దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు ఈనెల 22న తొండంగి మండలానికి వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ మండల కన్వీనర్ పోతల రమణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వెంకటేష్‌తో కలసి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వల్లూరు, హంసవరం, వి.కొత్తూరు, డి.పోలవరం, చామవరం, రేఖవానిపాలెం, కె.ఒ.మల్లవరం, రాపాక, డి.పోలవరం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆ రోజు సాయంత్రం తొండంగి మండలం దానవాయపేట శివారు తాటియాకులపాలెం సమీపంలో బీచ్ రోడ్డువద్ద జగన్ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి జగన్ పర్యటనకు, దివీస్ వ్యతిరేక పోరాట బాధితులకు మద్దతుగా భారీగా తరలిరావాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తలు రెండేళ్లు ఓపిక పట్టాలని, అధికార పార్టీ ఆగడాలకు కళ్లెం వేసే రోజులు దగ్గరపడ్డాయన్నారు. తప్పుడు కేసులు బనాయించినా భయపడొద్దని, కార్యకర్తలంతా మనో నిబ్బరంతో ముందుకుసాగాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండడంతో కొత్తపార్టీలను ప్రోత్సహించేందుకు తెరపైకి తెస్తున్నారన్నారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే మహిళలు నిలదీస్తున్నారని, నాయకులకు కట్టిన ఫ్లెక్సీలన్ని ఓట్లు కూడా టీడీపీకి రావన్నారు. గడపగడపకూ వైఎస్సార్‌లకు వెళ్తుంటే గ్రామీణులు సైతం ముఖ్యమంత్రిపైన, నాయకులపైన ధ్వజం ఎత్తుతున్నారన్నారు. ఎంపీపీ పల్లేటి నీరజ, వైస్ ఎంపీపీ పురుషోత్తం గంగాభవానీ, ఎంపీటీసీలు చేపల గున్నబ్బాయి, బోజంకి లక్ష్మి, డబ్బూరి నాగశివ, కర్రి నాగేశ్వరరావు, కోడి గంగతల్లి, పలివెల కుమారి, నాగలక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ కుర్ర బాబ్జీ, మాజీ సర్పంచ్ అత్తి వెంకటరమణ, డాక్టర్ బొప్పన రాము, రెడ్డి దత్తుడు, చింతల వెంకటరమణ, అన్నంరెడ్డి వీర్రాఘవులు, డి.బెనర్జీ, బర్రే అప్పారావు పాల్గొన్నారు.
అనంత ఉదయభాస్కర్ పిలుపు
అడ్డతీగల : ఈనెల 22న జిల్లాలోని తొండంగి మండలం పంపాదిపేటలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్ రెడ్డి పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ పిలుపునిచ్చారు. 22 న మధ్యాహ్నం మధురపూడి విమానాశ్రయానికి జగన్ చేరుకుని హైవే మీదగా పంపాదిపేటకు వెళ్లి అక్కడ దివీస్ ప్రభావిత గ్రామాల బాధితులతో సమావేశమౌతారన్నారు.పార్టీ యువజన విభాగం మండల బాధ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పర్యటనలో పాల్గొనాలని ఆయన కోరారు.