‘సీడీఎంఏ’ వెబ్సైట్ హ్యాకింగ్
హైదరాబాద్/గోదావరిఖని, న్యూస్‌లైన్: కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాకింగ్ చేశారు. వెబ్సైట్లోకి అక్రమంగా చొరబడి అందులో ఉన్న సమాచారాన్ని తొలగించారు. ముఖ్యంగా సర్క్యులర్ విభాగంలో ఉండాల్సిన ప్రభుత్వ సర్క్యులర్లు అన్నింటినీ కనిపించకుండా చేశారు.
సర్క్యులర్ సబ్జెక్ట్‌ను తెలియజేసే చోట ‘పాకిస్థాన్ జిందాబాద్... హాక్డ్ అనౌన్ కాప్... షాక్డ్..?’ తదితర పదాలతోపాటు బూతు పదాలను చేర్చారు. ఈనెల 18న రాత్రి 8.30 గంటలకు హ్యాకింగ్ చేసినట్టు తెలుస్తోంది. గుజరాత్ నుంచి ఒకరు ఈ సమాచారాన్ని కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమాచారాన్ని అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు మధ్యాహ్నం పనెన్నండున్నర గంటల సమయానికల్లా అనుచిత వ్యాఖ్యలను తొలగించి, వెబ్‌సైట్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు.
ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని పారదర్శకంగా ఉండేందుకు వీలుగా అన్ని సర్క్యులర్లను, ప్రభుత్వ ఉత్తర్వులను, తమ వెబ్సైట్లో పొందుపరుస్తున్నామని, అలాంటి తమ వైబ్‌సైట్ హ్యాకింగ్ కావడం విచిత్రంగా ఉందని కమిషనర్ బి. జనార్దన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. తమకు సమాచారం అందగానే..ఆ అంశాలను తొలగించి వెబ్‌సైట్‌ను తిరిగి యథావిధంగా వినియోగంలోకి తెచ్చామన్నారు.