50 దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు
ద్వారకా తిరుమల : రాష్ట్రంలో 50 దేవాలయాల్లో ఆన్లైన్ ద్వారా భక్తులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ తెలిపారు. ద్వారకా తిరుమల మాధవకల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీ నిమిత్తం విచ్చేసిన ఆమె వారికి నైపుణ్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ విజయవాడలోని గొల్లపూడిలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తులకు మౌలిక వసతులు కల్పించి, పచ్చని పరిశుభ్ర వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. యువతను భక్తివైపు నడిపించేలా ఆలయాలను తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు.