Commissioner of Inquiry
-
మీ విచారణలో నిష్పాక్షికత లేదు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన అసాధారణ విజయాలకు మసిపూసేలా పనిచేస్తున్నారంటూ విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని, నిరాధారమైన ఆరోపణలకు ఊతమిచ్చేలా వ్యవహరించడం బాధాకరమంటూ ఏడు పేజీల లేఖను జగదీశ్‌రెడ్డి శనివారం తన పీఏ ద్వారా కమిషన్‌కు పంపించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఉద్దేశాలను తప్పుబట్టారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.పద్నాలుగేళ్లు తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. నిమిషం కరెంటు కోత లేకుండా రైతులు, పారిశ్రామికవేత్తలకు, గృహాలకు విద్యుత్ అందిస్తే... ఏదో జరిగిపోయిందన్నట్లుగా, జరిగిన నష్టాన్ని లెక్కకట్టడమే మిగిలిందన్నట్లుగా మాట్లాడడం, మరునాడే ఆరువేల కోట్ల నష్టం అని అన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఇలాంటి వార్తలు వచి్చనందున వారికి ఆ సమాచారం ఎలా వచి్చంది, ఏ ఆధారాలతో ఆ వార్తను ప్రచురించారనే అంశాలు కూడా విచారణలో భాగం కావలసిన అవసరం ఉందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90కి కొన్నాం తాము ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయంలో రాష్ట్రంలో విద్యుత్ తీవ్ర సంక్షోభంలో ఉందని, 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని జగదీశ్ రెడ్డి లేఖలో వివరించారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకు వచి్చన 400 మెగావాట్ల సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుందని, ఈ పరిస్థితుల్లో విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఐఎల్ మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్పల్లి వరకు ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం ప్రారంభించిందని, పీజీసీఐఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్ధతో విద్యుత్ ఒప్పందం ఉండాలన్న నిబంధన మేరకు ఛత్తీస్‌గఢ్‌తో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్‌ను రూ.17కు కొంటున్న పరి స్థితి ఉండగా, ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90కి యూని ట్ చొప్పున కొనాలని తెలంగాణ ఈఆర్సీ నిర్ణయించిందని వివరించారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రూ.4.90కి విద్యుత్ తీసుకున్నారన్నారు. రాష్ట్ర కరెంటు డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో, యాదాద్రి ప్లాంట్‌ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయిందని వివరించారు. -
అక్రమార్కుల్లో వణుకు
- మధ్యమానేరు భూసేకరణలో అవకతవకలు - విచారణకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ నియామకం - నిజాలు నిగ్గుతేల్చనున్న కమిషన్ సిరిసిల్ల : మధ్యమానేరు జలాశయ నిర్మాణానికి 15854.38 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 15219.13 ఎకరాలు సేకరించారు. భూసేకరణ కోసం రూ.255 కోట్లను పరిహారంగా ఖర్చు చేశారు. జలాశయ నిర్మాణంలో ముంపునకు గురయ్యే సిరిసిల్ల మండలంలోని చీర్లవంచ, చింతల్‌ఠాణా, వేములవాడ మండలంలోని అనుపురం, కొడుముంజ, రుద్రవరం, సంకెపల్లి, బోయినపల్లి మండలంలోని వర్దవెల్లి, కొదురుపాక, నీలోజిపల్లె, శాభాష్‌పల్లి గ్రామాల్లో నిర్వాసితులకు పరిహారం పూర్తిస్థాయిలో అందలేదు. మునిగిపోయే భూములను సేకరించి డబ్బులు చెల్లించారు. ఇళ్లకు మాత్రం పరిహారం ఇవ్వలేదు. పరిహారం పంపిణీల్లో పైరవీకారులదే పైచేయిగా మారిందనే ఆరోపణలున్నాయి. వ్యవసాయ యోగ్యంకాని భూములను వ్యవసాయ భూములుగా పేర్కొంటూ ఏ గ్రేడ్ భూములుగా పరిహారం దక్కించుకున్నారు. సిరిసిల్ల మండలం గోపాల్‌రావుపల్లె శివారులోని ప్రభుత్వ భూములను పట్టాభూములుగా చూపుతూ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు రూ.కోటి మేర స్వాహా చేశాడు. భార్య, తల్లి పేరిట ప్రభుత్వ భూమిని పట్టా చేయించి ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు. ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లెలో కొత్తగా పైపులైన్లు వేసి పరిహారంగా రూ.లక్షలు నొక్కేశారు. తాత్కాలిక షెడ్లను, కోళ్లఫారాలను నిర్మించి పరిహారం దండుకున్నారు. రుద్రవరం, కొదురుపాక గ్రామాల్లో భారీ ఎత్తున తాత్కాలిక షెడ్లను నిర్మించి రాజకీయ అండదండలతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాజేశారు. అప్పటి మంత్రులు, రాజకీయ నాయకుల బంధువులకు పరిహారం పేరిట సర్కారు ఖజానాను దోచిపెట్టారు. సంకెపల్లి, కొడుముంజ, అనుపురం, సిరిసిల్ల మండలం చీర్లవంచ, చింతల్‌ఠాణా, గోపాల్రావుపల్లి గ్రామాల్లో భూసేకరణ పేరిట భారీ అక్రమాలు జరిగాయి. అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేయడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఎస్సారెస్పీ పరిధిలో ఇంజినీర్లుగా పని చేసిన పలువురు అధికారులపై విచారణ సాగుతుండగా, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణతో అక్రమార్కుల బండారం బయటపడనుంది. ఆది నుంచి వివాదమే.. శ్రీరాంసాగర్ వరదకాలువలో భాగంగా 25.873 టీఎంసీల లక్ష్యంతో మానేరు నదిపై మధ్యమానేరు జలాశయాన్ని బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద జలయజ్ఞంలో భాగంగా 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టింది. అంచనా వ్యయం పెంచడం నుంచి నిర్మాణం వరకు మొదటినుంచీ అడ్డంకులే ఎదురయ్యాయి. 2006లో రూ.406.48 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవగా జెడ్‌వీఎస్-రత్న-సుశీ జాయింట్ వెంచర్ రూ.339.39 కోట్లకు దక్కించుకుంది. 2006లో పని ఒప్పందం జరగ్గా, 2009 నాటికి జలాశయం పూర్తికావాలి. కానీ, ఈ సంస్థ రూ.77.58 కోట్ల పని చేసి చేతులెత్తేసింది. దీంతో గుత్తేదారును తొలగించిన అప్పటి ప్రభుత్వం రూ.454 కోట్ల అంచనాలతో 2012లో మరో కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరిగింది. 2015 నాటికి జలాశయం పని పూర్తి కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.28 కోట్ల పని చేసి జలాశయం పనులను ఆపివేశారు. ప్రస్తుతం భూసేకరణలో అక్రమాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో నాటి అక్రమార్కులు మెక్కిన ప్రజాధనాన్ని కక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు రావడంతో అక్రమార్కులు వణికిపోతున్నారు.