అక్రమార్కుల్లో వణుకు | Appointment of a hearing by the Commissioner of Inquiry | Sakshi
Sakshi News home page

అక్రమార్కుల్లో వణుకు

Published Wed, Aug 13 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

Appointment of a hearing by the Commissioner of Inquiry

- మధ్యమానేరు భూసేకరణలో అవకతవకలు
- విచారణకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ నియామకం
- నిజాలు నిగ్గుతేల్చనున్న కమిషన్

 సిరిసిల్ల : మధ్యమానేరు జలాశయ నిర్మాణానికి 15854.38 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 15219.13 ఎకరాలు సేకరించారు. భూసేకరణ కోసం రూ.255 కోట్లను పరిహారంగా ఖర్చు చేశారు. జలాశయ నిర్మాణంలో ముంపునకు గురయ్యే సిరిసిల్ల మండలంలోని చీర్లవంచ, చింతల్‌ఠాణా, వేములవాడ మండలంలోని అనుపురం, కొడుముంజ, రుద్రవరం, సంకెపల్లి, బోయినపల్లి మండలంలోని వర్దవెల్లి, కొదురుపాక, నీలోజిపల్లె, శాభాష్‌పల్లి గ్రామాల్లో నిర్వాసితులకు పరిహారం పూర్తిస్థాయిలో అందలేదు. మునిగిపోయే భూములను సేకరించి డబ్బులు చెల్లించారు. ఇళ్లకు మాత్రం పరిహారం ఇవ్వలేదు.

పరిహారం పంపిణీల్లో పైరవీకారులదే పైచేయిగా మారిందనే ఆరోపణలున్నాయి. వ్యవసాయ యోగ్యంకాని భూములను వ్యవసాయ భూములుగా పేర్కొంటూ ఏ గ్రేడ్ భూములుగా పరిహారం దక్కించుకున్నారు. సిరిసిల్ల మండలం గోపాల్‌రావుపల్లె శివారులోని ప్రభుత్వ భూములను పట్టాభూములుగా చూపుతూ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు రూ.కోటి మేర స్వాహా చేశాడు. భార్య, తల్లి పేరిట ప్రభుత్వ భూమిని పట్టా చేయించి ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు.

ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లెలో కొత్తగా పైపులైన్లు వేసి పరిహారంగా రూ.లక్షలు నొక్కేశారు. తాత్కాలిక షెడ్లను, కోళ్లఫారాలను నిర్మించి పరిహారం దండుకున్నారు. రుద్రవరం, కొదురుపాక గ్రామాల్లో భారీ ఎత్తున తాత్కాలిక షెడ్లను నిర్మించి రాజకీయ అండదండలతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాజేశారు. అప్పటి మంత్రులు, రాజకీయ నాయకుల బంధువులకు పరిహారం పేరిట సర్కారు ఖజానాను దోచిపెట్టారు.

సంకెపల్లి, కొడుముంజ, అనుపురం, సిరిసిల్ల మండలం చీర్లవంచ, చింతల్‌ఠాణా, గోపాల్‌రావుపల్లి గ్రామాల్లో భూసేకరణ పేరిట భారీ అక్రమాలు జరిగాయి. అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేయడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఎస్సారెస్పీ పరిధిలో ఇంజినీర్లుగా పని చేసిన పలువురు అధికారులపై విచారణ సాగుతుండగా, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణతో అక్రమార్కుల బండారం బయటపడనుంది.
 
ఆది నుంచి వివాదమే..
శ్రీరాంసాగర్ వరదకాలువలో భాగంగా 25.873 టీఎంసీల లక్ష్యంతో మానేరు నదిపై మధ్యమానేరు జలాశయాన్ని బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద జలయజ్ఞంలో భాగంగా 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టింది. అంచనా వ్యయం పెంచడం నుంచి నిర్మాణం వరకు మొదటినుంచీ అడ్డంకులే ఎదురయ్యాయి. 2006లో రూ.406.48 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవగా జెడ్‌వీఎస్-రత్న-సుశీ జాయింట్ వెంచర్ రూ.339.39 కోట్లకు దక్కించుకుంది. 2006లో పని ఒప్పందం జరగ్గా, 2009 నాటికి జలాశయం పూర్తికావాలి.

కానీ, ఈ సంస్థ రూ.77.58 కోట్ల పని చేసి చేతులెత్తేసింది. దీంతో గుత్తేదారును తొలగించిన అప్పటి ప్రభుత్వం రూ.454 కోట్ల అంచనాలతో 2012లో మరో కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరిగింది. 2015 నాటికి జలాశయం పని పూర్తి కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.28 కోట్ల పని చేసి జలాశయం పనులను ఆపివేశారు. ప్రస్తుతం భూసేకరణలో అక్రమాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో నాటి అక్రమార్కులు మెక్కిన ప్రజాధనాన్ని కక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు రావడంతో అక్రమార్కులు వణికిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement