సారీ అండీ!
గాసిప్
‘హెరా ఫేరీ 3’లో శ్రుతీహాసన్ నటించనుందనే వార్తలు నిన్నా మొన్నటి వరకు గట్టిగా వినిపించాయి. అయితే ఈ సినిమా చేయడం లేదని ఆమె తాజాగా ప్రకటించింది. డేట్స్ కమిట్మెంట్స్ వల్ల సినిమా చేయలేకపోతోందట. అయితే గుసగుసలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయి. తండ్రి కమల్‌హాసన్, బాలీవుడ్ నటదిగ్గజం ఆమిర్ఖాన్లకు ఉన్న ‘పర్ఫెక్షనిస్ట్’ అనే పేరు తాను కూడా తెచ్చుకోవాలనుకోవడంతో ఆమె అతిగా ఆచితూచి వ్యవహరిస్తోందనే మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి.
నీరజ్ వొరా దర్శకత్వం వహిస్తున్న ‘హెరా ఫేరి 3’ సేఫ్ ప్రాజెక్ట్‌గానే చెప్పుకోవాలి. పైగా పరేష్ రావల్, సునీల్‌శెట్టి, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్‌లాంటి ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. బాలీవుడ్లో నిలబడడానికి శ్రుతీహాసన్‌కు ఈ సినిమా ఉపకరిస్తుందని కూడా సినీ పండితులు అంచనా వేశారు.
మరి ఈ తేనె కళ్ల సుందరి సినిమా ఎందుకు చేయనంది?
తాజా గుసగుస ప్రకారం... ఈ సినిమాలో తన పాత్రను హీరోల పాత్రలతో పాటు హీరోయిన్లు ఇషా గుప్తా, నేహాశర్మల పాత్రలతో పోల్చి చూసుకుందట. కొలతలు వేసిందట. మిగిలిన వారితో పోల్చితే తన పాత్రకు ప్రత్యేకత ఏదీ కనిపించలేదట.
‘మొక్కుబడిగా కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తేనే మేలు’ అనుకొని డెరైక్టర్ నీరజ్‌కు, ప్రొడ్యూసర్ ఫిరోజ్‌కు ‘సారీ’ చెప్పిందట!