గిరిజనులకు మూడు క్రీడా అకాడమీలు
పాడేరు, న్యూస్‌లైన్ : గిరిజనుల క్రీడాభివృద్ధికి రాష్ట్రం లోని ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో మూడు క్రీడా ఆకాడమీలను ఏర్పాటు చేస్తున్నామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.బాలరాజు తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర కూడా వేశారన్నారు. కమ్యూనిటీ పోలి సింగ్‌లో భాగంగా జిల్లా పోలీసుశాఖ నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల ఫైనల్ మ్యాచ్‌ను ఆదివారం మంత్రి బాలరాజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మం త్రి మాట్లాడుతూ ఏజెన్సీలో క్రీడారంగాన్ని పోలీసు శాఖ ప్రోత్సహించడం సంతోషదాయకమన్నారు.
ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి రూ.2.50 కోట్లతో స్టేడియంల నిర్మిస్తోందని, వీటిలో పాడేరుకు రెండు, అరకులోయకు ఒక స్టేడియం మంజూ రైందన్నారు. 100 గ్రామాల గిరిజన క్రీడాకారులకు ఈ నెల 14న వాలీబాల్, క్రికెట్ కిట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి పోలీసుశాఖ వినూత్న సేవా కార్యక్రమాలను చేపడుతోందన్నారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలకు విశేష స్పందన లభించిందన్నారు. రానున్న రోజుల్లో క్రికెట్, కబడ్డీ, అర్చరీ పోటీలను కూడా నిర్వహిస్తామన్నారు. ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా క్రీడా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని, అన్ని పాఠశాలల్లోను క్రీడలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అనంతరం టోర్నమెంట్లో విజేత అరకులోయ వాలీబాల్ జట్టు, రన్నర్ కేడీపేట జట్టు క్రీడాకారులను మంత్రి అభినందించి ప్రోత్సహక నగదు, షీల్డ్‌లను అందజేశారు. కార్యక్రమంలో ఎఎస్పీలు విశాల్‌గున్ని, పకీరప్ప, నర్సీపట్నం ఓఎస్డీ ఎ.ఆర్.దామోధర్, పలువురు ఉన్నతాధికారులు, గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.