భారత లగ్జరీ మార్కెట్లోకి వోల్వో పరుగులు
గోథెన్బర్గ్ : స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్పొరేషన్, భారత లగ్జరీ కార్ల మార్కెట్లోకి ప్రవేశించాలనుకుంటోంది. వచ్చే ఏడాది నుంచి వరుసగా కాంపాక్ట్ సిరీస్‌తో మొదలుపెట్టి పలు మోడళ్లను ఆవిష్కరించనున్నట్టు తెలిపింది. కాంపాక్ట్ సిరీస్ తర్వాత ఎస్యూవీ కాన్సెప్ట్ 40.1, సెడాన్ కాన్సెప్ట్ 40.2లను భారత్ రోడ్లపై పరుగెత్తించాలని కంపెనీ భావిస్తోంది. అయితే గతవారమే ఈ 40 కాంపాక్ట్ సిరీస్ కార్లను స్వీడన్‌లోని తన ప్రధాన కార్యాలయం గోథెన్బర్గ్ లో వోల్వో ప్రవేశపెట్టింది. ప్రత్యర్థి కార్ల తయారీ కంపెనీలు మొదట ప్రవేశపెట్టిన లగ్జరీ మోడల్స్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఆడీ క్యూ3, ఆడీ ఏ3, మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఈలకు పోటీగా ఈ లగ్జరీ కార్లను ప్రవేశపెట్టాలనుకుంటోంది. అయితే పట్టణ యువతను ఈ మోడల్ కార్లు ఎక్కువగా ఆకట్టుకున్నాయి.
భారత మార్కెట్లోకి మొదట రాబోతున్న కార్ల ధర రూ. 26 లక్షలకు పైగా ఉండబోతున్నట్టు అంచనా. భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ లో ప్రవేశపెట్టబోయే ఎస్‌యూవీలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ మెర్టెన్స్ చెప్పారు. బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) దేశాల్లో ఈ కార్ల అమ్మకాల్లో ఎక్కువ వృద్ధి కనపడుతోందన్నారు. ఎస్యూవీ, సెడాన్ మోడళ్లతో పాటు 40 సిరీస్ హాచ్ బ్యాక్ మోడళ్లను కూడా వోల్వో సంస్థ అభివృద్ధి చేయనుంది. ఈ స్వీడిష్ కంపెనీ వచ్చే నెలల్లో హైబ్రిడ్ వెర్షన్ ఎస్ యూవీ ఎక్స్ సీ90ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించబోతుంది.