వృద్ధి బాటన భారత్ ఆర్థిక వ్యవస్థ
లండన్: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటన కొనసాగుతున్నట్లు పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ విశ్లేషణా సంస్థ- ఓఈసీడీ పేర్కొంది. ప్రధానంగా 34 ప్రధాన ఆర్థిక వ్యవస్థల ఆర్థిక పనితీరును విశ్లేషించే ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ) తన కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్ (సీఎల్ఐ) సంకేతాల ప్రాతిపదికన తాజా జూలై అధ్యయనాన్ని వెలువరించింది. భారత్‌కు సంబంధించి సీఎల్ఐ జూన్‌లో 98.9 పాయింట్ల వద్ద ఉండగా, ఇది జూలైలో 99 వద్దకు పెరిగింది. మార్చిలో ఈ పరిమాణం 98.5 వద్ద ఉంది. భారత్ ఆర్థికాభివృద్ధి రేటు జూన్ క్వార్టర్లో రెండున్నర సంవత్సరాల గరిష్ట స్థాయిలో 5.7 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.
ఇతర దేశాల విషయంలో...
చైనా, రష్యాల ఆర్థికాభివృద్ధి స్థిరత్వంలో ఉన్నట్లు ఓఈసీడీ తెలిపింది. బ్రెజిల్ కూడా వృద్ధి బాటలో వేగం పుంజుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా, కెనడా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలు స్థిరత్వం సాధిస్తున్నట్లు ఓఈసీడీ పేర్కొంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా సాగుతున్నట్లు పేర్కొంది. ఇటలీ మాత్రం వృద్ధిలో వెనుకడుగులో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. మొత్తంగా యూరో ప్రాంతం అలాగే ఫ్రాన్స్‌లో సీఎల్ఐ స్థిరత్వంగా కొనసాగుతోంది. జపాన్ విషయానికి వస్తే- వృద్ధి విషయంలో కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటోంది.
క్రెడిట్ పాజిటివ్‌లో బ్యాంకులు: మూడీస్
ఇదిలావుండగా బాసెల్-3 ప్రమాణాల సాధన దిశలో బాండ్ల జారీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల సడలింపు బ్యాంకులకు సానుకూల అంశమని ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ఒక విశ్లేషణా పత్రంలో పేర్కొంది. నిధుల సమీకరణకుగాను ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇది ‘క్రెడిట్ పాజిటివ్’అని వివరించింది. ఈ నిబంధనల సడలింపు వల్ల టైర్-1 మూలధన నిష్పత్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులు మరింత మెరుగుపరుచుకోగలుగుతాయని వివరించింది. బాండ్లలో పెట్టుబడుల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్ భాగస్వామ్యానికి ఆమోదించడం వల్ల బ్యాంకుల ఇన్వెస్టర్ బేస్ విస్తృతమవుతుందని అభిప్రాయపడింది.