భారత్ వృద్ధి తీరు పటిష్టం: ఓఈసీడీ
లండన్: భారత్ జీడీపీ వృద్ధి ధోరణి పటిష్టంగా ఉందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ-ఓఈసీడీ పేర్కొంది. తన నవంబర్ కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్‌ఐ) ఆధారంగా ఓఈసీడీ ఈ విశ్లేషణ జరిపింది. భారత్‌కు సంబంధించి నవంబర్ సీఎల్‌ఐ 99.5 పాయింట్లుగా నమోదయ్యింది.
అక్టోబర్‌లో ఇది 99.3గా ఉంది. సెప్టెంబర్‌లో 99.1 వద్ద ఉంది. ఆగస్టులో 99. జూలైలో 98.8. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతి ధోరణికి సంకేతమని పేర్కొంది. భారత్‌తో పాటు జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడే అవకాశమున్నట్లు ఓఈసీడీ అభిప్రాయపడింది. జర్మనీ, ఇటలీ, రష్యాల ఆర్థిక వ్యవస్థల వృద్ధి బలహీనంగా ఉంది. బ్రిటన్‌లో వృద్ధి తీరు గరిష్ట స్థాయి నుంచి కొంచెం వెనక్కు తగ్గిందని ఓఈసీడీ నివేదిక పేర్కొంది.