ఈ ఏడాది 5.7 శాతం వృద్ధి
వాషింగ్టన్: భారత్ ఈ ఏడాది 5.7 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. భారీ పెట్టుబడుల ప్రాజెక్టులు పురోగతి సాధిస్తుండడం, రూపాయి మారకం విలువ మరింత పోటాపోటీగా మారడంతో ఇండియా మెరుగైన వృద్ధి సాధిస్తుందని బుధవారం విడుదల చేసిన నివేదికలో బ్యాంక్ తెలిపింది. భారత్ ఈ ఏడాది 5.4 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) మంగళవారం పేర్కొన్న సంగతి విదితమే. ఈ అంచనాల నేపథ్యంలోనే సెన్సెక్స్‌లో ర్యాలీ నెలకొని సుమారు 360 పాయింట్లు పెరిగి 22,702 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. గత ఆగస్టులో డాలరుతో రూ.68.65గా ఉన్న రూపాయి మారకం విలువ ప్రస్తుతం 60 స్థాయిలో కొనసాగుతోంది. కాగా, దక్షిణాసియాలో ప్రస్తుతం 5.2%గా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు వచ్చే ఏడాది 5.8 %నికి చేరుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా.
ఆర్థిక స్థిరత్వం మెరుగుపడింది: ఐఎంఎఫ్
అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక స్థిరత్వం గత ఆరునెలల్లో బాగా మెరుగుపడిందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. అయితే, ఇదే కాలంలో వర్థమాన దేశాల్లో స్థిరత్వం క్షీణించిందని బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ‘ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కామని ఇప్పుడే చెప్పలేం. ప్రపంచంలో ఆర్థిక స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటోంది. యూరప్ దేశాల్లో మార్కెట్ విశ్వాసం గణనీయంగా పెరిగింది...’ అని ఐఎంఎఫ్ ఆర్థిక సలహాదారు వియల్స్ వాషింగ్టన్లో తెలిపారు.