ఇక వాహన బీమా మూడేళ్ళకోసారి..
వాహన బీమా అంటే ఏడాదికోసారి తీసుకోవాల్సిందే. అదే పెద్ద తలనొప్పి. అయితే ద్విచక్ర వాహనదారులకు కొంతవరకూ ఈ తలనొప్పి తొలగుతోంది. ఎందుకంటే ఇక మూడేళ్లకోసారి వారు తమ వాహనానికి బీమా తీసుకుంటే సరిపోతుంది. ఈ సరికొత్త దీర్ఘకాలిక కాంప్రిహెన్సివ్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఇటీవలే ‘న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ’కి బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ అనుమతినిచ్చింది. దీన్లో బాగా సంతోషించదగ్గ అంశమేమిటంటే ఇటువంటి పాలసీలపై ఏకంగా 30 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
దీనిపై న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ‘‘వినియోగదారుడికి నో క్లెయిమ్ బోనస్, అండర్ రైటింగ్ ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. దానికి అదనంగా 30 శాతం వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది’’ అని చెప్పారు. ఇలాంటి పథకాల వల్ల బీమా కంపెనీలకు పాలన పరమైన ఖర్చులు చాలావరకూ తగ్గుతాయి. ఈ పాలసీని అతిత్వరలో ప్రారంభించే అవకాశముంది. ఇంకో ముఖ్యమైన ప్రయోజనమేంటంటే పాలసీ మధ్యలో ఉండగా బీమా కంపెనీ ప్రీమియం ధరలను సవ రించటం చేయజాలదు. క్లెయిమ్ చేసినా కూడా అదే ప్రీమియం కొనసాగుతుంది. అదీ విషయం. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కదూ!! కాస్త వేచి చూడండి మరి.!