సమగ్ర విత్తన చట్టం కోసం కృషి
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
హైదరాబాద్: రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం సమగ్ర విత్తన చట్టం తీసుకురావడానికి తనవంతుగా కృషి చేస్తా నని, ఈ విషయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి, ప్రధాన మంత్రితో చర్చిస్తానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీనిచ్చారు. తెలంగాణ భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని నారాయణగూడలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
రైతుల భాగస్వామ్యంతోనే దేశం మరింత ప్రగతి సాధిస్తుందని, వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కల్తీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సాగునీరు, 24 గంటల కరెంట్ ఇస్తే కాలానుగుణంగా రైతులు అనేక పంటలను పండిస్తారని, దీంతో ఆత్మహత్యలనేవే ఉండవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఇప్పటి వరకు రూ.18 కోట్లు మంజూరు చేసిందన్నారు.