పనులు పూర్తిచేయని సంస్థలపై చర్యలు తీసుకోవాలి
ఐటీడీఏ అధికారులకు కలెక్టర్ ఆదేశం
హన్మకొండ అర్బన్ : సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయని సంస్థలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కిషన్ ఆదేశించారు. 2011-12, 2012-13 సంవత్సరం ఐఏపీ పనుల పురోగతిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఆయన ఐటీడీఏ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంట్రిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద చేపట్టే పనుల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటి వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. ఐఏపీ పనుల్లో 65 శాతం గిరిజన ప్రాంతాల్లో వినియోగించాల్సి ఉండగా... జిల్లాలో 85 శాతం వినియోగిస్తున్నామని చెప్పారు.
ఏటూరునాగారం పరిధిలోని అన్ని పాఠశాలల్లో,వసతి గృహాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించి ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి, విద్యార్థులకు సురక్షిత మంచి నీటిని అందించాలన్నారు. వెంటిలేటర్స్‌తో కూడిన అంబులెన్స్‌లు కొనుగోలు చేయాలని, ఇందుకోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీలకు ఎల్ఈడీ లైట్లు సరఫరా చేసి, తద్వారా విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, సీపీఓ బీఆర్‌రావు, ఇతర అధికారుల పాల్గొన్నారు.