కలెక్టరేట్లో అగ్నిప్రమాదం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. సునయన ఆడిటోరియం షటిల్ బాడ్మింటన్ కోర్టు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన పాత కంప్యూటర్లు, యూపీఎస్‌లు, ఇతర ఎలక్ట్రికల్ సామగ్రి కాలిపోయింది.
సునయన ఆడిటోరియం కంట్రోల్ రూమ్‌లో చోటుచేసుకున్న షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రేగడంతో ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మంటలను అదుపు చేసేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది, తదితరులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సునయన ఆడిటోరియంలోకి మాత్రం మంటలు వ్యాపించలేదు.
నిర్వహణలోపం వల్లే : కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ సరఫరా, ఎలక్ట్రికల్ వస్తువుల నిర్వహణ సరిగా లేకపోవడమే షార్ట్ సర్క్యూట్‌కు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఘటన కారణంగా సుమారు 20 పాత కంప్యూటర్లు, యూపీఎస్‌లు దగ్ధమయ్యాయి. కర్నూలు అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపు చేసింది.
జిల్లా అగ్నిమాపక దళాధికారి భూపాల్‌రెడ్డి కూడా పరిస్థితిని సమీక్షించారు. కాలిపోయినవన్నీ పనికిరానివి, పాతవి అయినందునా నష్టమేమీ లేదని జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. డీఆర్వోతోపాటు కలెక్టరేట్ పాలనాధికారి మాధవరావు తదితరులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి కారణాలను సమీక్షించారు.
ఇది రెండోసారి: కలెక్టరేట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం ఇది రెండోసారి. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగిం రూ.10 లక్షల విలువైన కంప్యూటర్లు, యూపీఎస్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి.