అదానీ బ్రాండింగ్... నిబంధనలకు విరుద్ధం
న్యూఢిల్లీ: నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం లీజుకిచ్చిన మూడు విమానాశ్రయాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ తన సొంత బ్రాండ్ పేరును ఉపయోగిస్తుండటంపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కన్సెషన్ ఒప్పంద (సీఏ) నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొంది. ఒప్పందం ప్రకారం విమానాశ్రయాలను నిర్వహించే కంపెనీలు తమ పేరు లేదా షేర్‌హోల్డర్ల పేర్లతో బ్రాండింగ్ చేసుకోరాదని తెలిపింది.
దీనికి విరుద్ధంగా, నిబంధనలను ఉల్లంఘిస్తూ డిస్ప్లే బోర్డులన్నింటిలోనూ అదానీ ఎయిర్‌పోర్ట్స్ పేరు ప్రత్యేకంగా కనిపిస్తోందంటూ కొద్ది రోజుల క్రితం మంగళూరు ఎయిర్పోర్ట్ చీఫ్ ఎయిర్పోర్ట్ ఆఫీసర్‌కు ఏఏఐ లేఖ రాసింది. అటు లక్నో, అహ్మదాబాద్ విమానాశ్రయాలకు కూడా ఇలాంటి లేఖలే పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పంద నిబంధనల ప్రకారం.. విమానాశ్రయంలో ఎక్కడా కూడా నిర్వహణ సంస్థ లేదా దాని షేర్‌హోల్డర్ల పేర్లతో ప్రకటనలు ఉండకూడదు. ఒకవేళ అలా చేయదల్చుకున్న పక్షంలో ఏఏఐ పేరును కూడా పొందుపర్చి, సముచిత ప్రాధాన్యమివ్వాలని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నిబంధనలకు అనుగుణంగానే..
ఏఏఐ ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. తాము నిబంధనలకు కట్టుబడే ఉన్నామని స్పష్టం చేసింది. ‘‘బాధ్యతాయుతమైన సంస్థగా మేము ఒప్పంద నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉంటాము. ఆన్–సైట్ బ్రాండింగ్‌పై ఏఏఐ స్పష్టత కోరింది. వివరణ ఇస్తున్నాం. నిబంధనలకు అనుగుణంగా విమానాశ్రయాల చట్టబద్ధమైన పేర్లను యథాప్రకారం ప్రముఖంగా కనిపించేలాగానే ప్రకటనలు ఉంటున్నాయి. మూడు విమానాశ్రయాల పేర్లు మార్చేందుకు ప్రయత్నమేమీ చేయలేదు. చేసే యోచన కూడా లేదు’’ అని అదానీ గ్రూప్ తెలిపింది. మరోవైపు, ఈ వివాదం సామరస్యంగానే పరిష్కారం కాగలదని భావిస్తున్నట్లు ఏఏఐ వర్గాలు తెలిపాయి. లీజు గడువు తీరిపోయిన తర్వాత అంతిమంగా ఆయా ఎయిర్‌పోర్టులు తిరిగి తమ చేతికే వస్తాయి కాబట్టి వివరణ కోరినట్లు పేర్కొన్నాయి.
లీజుకు ఆరు విమానాశ్రయాలు ...
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద విమాశ్రయాలను ప్రైవేటీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆరు విమానాశ్రయాలను (తిరువనంతపురం, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, మంగళూరు, గువాహటి) లీజుకిచ్చింది. 50 ఏళ్ల పాటు నిర్వహణకు అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. ప్రస్తుతం మంగళూరు, లక్నో, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా, మిగతావాటికి ఇంకా భద్రతాపరమైన క్లియరెన్సులు రావాల్సి ఉంది.