concrete mixer vehicle
-
కరీంనగర్లో నడిరోడ్డుపై లారీ దగ్ధం
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో నడిరోడ్డుపై మంగళవారం లారీ దగ్ధమయింది. లారీతో పాటు లారీలో ఉన్న కాంక్రిట్ మిక్సర్ మిషన్ కాలిబూడిదయ్యింది. మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లి-లింగాపూర్ గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్‌ను సప్లై చేసే లారీలో కరీంనగర్ నుంచి లింగాపూర్‌కు కాంక్రీట్ మిక్సర్ మిషన్ తీసుకెళ్తుండగా పైన కరెంటు వైర్లు తాకి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ బండిని ఆపి కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి మిక్సర్ కాలి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లో పడింది. లారీ క్యాబిన్‌తోపాటు టైర్లు కాలిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే మిక్సర్ కాలి బూడిద అయింది. లారీ పాక్షికంగా దెబ్బతింది. నడిరోడ్డుపై అగ్ని ప్రమాదం జరగడంతో ఆ దారిలో వెళ్లే వారు భయాందోళనకు గురయ్యారు. అయితే లింగాపూర్‌లో చెక్ డ్యామ్ నిర్మాణానికి కాంట్రాక్టర్ లారీలో కాంక్రిట్ మిక్సర్ మిషన్ తీసుకెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. నష్టం భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. చదవండి: సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య? ‘ఆ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పోటీపడుతున్నాయి’ -
ప్రాణాలు తీసిన చీకటి
దుత్తలూరు : జాతీయ రహదారిపై ఆగి ఉన్న కాంక్రీట్ మిక్సర్‌ను చీకట్లో గుర్తించలేక బైక్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన ఆదివారం రాత్రి 565వ జాతీయ రహదారిపై దుత్తలూరు–నర్రవాడ మార్గమధ్యంలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి చెందిన కంచుపాటి దావీద్ (50) కుమారుడు వివాహ నిశ్చితార్థం నిమిత్తం ఉదయగిరి మండలం సున్నంవారిచింతలకు చెందిన బక్కా శామ్యూల్ (35), అప్పసముద్రానికి చెందిన దావీద్, గన్నేపల్లికి చెందిన నప్పెర్ల నారాయణ బైక్‌పై దుత్తలూరు నుంచి కొత్తపేటకు బయలుదేరారు. దుత్తలూరు–నర్రవాడ మార్గమధ్యంలో జాతీయ రహదారిపై కాంక్రీట్ మిక్సర్ వాహనం ఆగి ఉంది. చీకట్లో బైక్‌పై వెళ్తున్న వీరు ఆ వాహనాన్ని గుర్తించలేక వెనుక ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న బక్కా శామ్యూల్ తల నుజ్జునుజ్జయింది. తలలోని మెదడు భాగం చెల్లాచెదురై అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యలో కూర్చొని ఉన్న కంచుపాటి దావీద్ తలకు బలమైన గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉండగా 108కు సమాచారమందించారు. 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకునే సరికి అతను కూడా మృతి చెందాడు. బైక్ వెనుక వైపు కూర్చొని ఉన్న నారాయణకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న ఉదయగిరి సీఐ సుబ్బారావు, దుత్తలూరు ఎస్సై ఎం.వెంకటరాజేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద విషయం తెలిసిన పరిసర ప్రాంత ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు, మృతదేహాలను చూసి చలించిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిద్రిస్తున్నపిల్లలపైకి దూసుకెళ్లిన వాహనం
సత్తెనపల్లి: కాంక్రీట్ మిక్చర్ కలిపే వాహనం కిందపడి ఓ చిన్నారి మృతి చెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక అచ్చంపేట రైల్వేగేట్ వద్ద నూతనంగా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నారు. అక్కడ పని చేయడానికి వచ్చిన కూలీలు తమ పిల్లలను పక్కనే ఉన్న చెట్టు కింద పడుకోబెట్టారు. ఈ పనుల్లో భాగంగా సిమెంట్ మిక్చర్ వాహనం రివర్స్ తీస్తూ నిద్రిస్తున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శరత్ అనే మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన అక్కడి కూలీలు గాయాల పాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.