బంగారంపై నిబంధనలు విధిస్తే ఉద్యమం
అనంతపురం రూరల్ : మహిళల బంగారు ఆభరణాలపై నిబంధనలు విధిస్తే కేంద్ర ప్రభుత్వంపై ప్రతక్ష్య పోరాటం చేస్తామని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెద్ద నోట్లను రద్దు చేసి పేద,సామాన్య ప్రజలను ప్రధాన మంత్రి మోదీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రోజుకోక నిబంధనతో ప్రజలను ఎన్డీఏ పాలకులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని మండిపడ్డారు.
నల్లధన కుబేరుల నుంచి ఒక్కపైసా కుడా బయటకు తీసుకురాలేకపోగా ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చారన్నారు. వెంటనే బంగారంపై నిబంధనలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి అరుణ, కార్పొరేటర్ పద్మావతి, నగర అధ్యక్షురాలు ఖుర్షిదా, పార్వతి, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.