బీ యాక్టివ్
నటిగా, సామాజిక బాధ్యతగల వ్యక్తిగా షబానా అజ్మీ.. అందరికీ సుపరిచితమే. ఆదివారం నగరంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలెంటరీ అసోసియేషన్ నిర్వహించిన ఓ సదస్సుకు షబానా, డెరైక్టర్ మహేష్‌భట్ పాల్గొన్నారు. నేటి సినిమాల్లో మహిళల్ని ఆటబొమ్మలుగా చిత్రీకరించడం, దేశంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపై జరిగిన చర్చలో వీరివురూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మహిళలు, సినిమాలపై షబానా ఏమన్నారంటే..కేవలం సెలబ్రిటీలు ప్రచారం చేసినంత మాత్రాన ఆడవాళ్లపై అత్యాచారాలు తగ్గవు.
స్త్రీ భ విత అందరి బాధ్యత అనేలా ప్రతి ఒక్కరిలోనూ ప్రేరణ కలగాలి. నేటికీ 12 ఏళ్ల బాలికలకు పెళ్లి చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. మహిళలపై లైంగిక దాడుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చినా కూడా వారిపై అత్యాచారాలు ఆగడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పురిటిలోనే చాలామంది ఆడపిల్లలు చనిపోతున్నారు. అది మాత్రమే కాక ఆడ శిశువని తెలియగానే గర్భంలోనే బిడ్డను చంపేస్తున్నారు. అ అరాచకత్వం పూర్తిగా నశించాలి. మై డియర్ గర్ల్స్ బీ యాక్టివ్.
హైదరాబాద్ నా పుట్టినిల్లు
నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. ఆ తర్వాత హై స్కూలింగ్, కాలేజీ అంతా ముంబైలో సాగింది. కానీ ఇక్కడ నాకు చాలా మంది బంధువులు ఉన్నారు. హైదరాబాద్‌కి ఎప్పుడూ వచ్చినా అందరినీ కలవడానికి ప్రయత్నిస్తా. ఇక్కడ రుచులు అమోఘం. ఇంకా రకరకాల కాస్ట్యూమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఐ లవ్ మై మదర్ ల్యాండ్.
- ఎస్.శ్రావణ్‌జయ