'ఆప్' కార్యక్రమాన్ని బహిష్కరించిన జర్నలిస్టులు
న్యూఢిల్లీ: సచివాలయంలోకి అనుమతించకపోవడంతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఢిల్లీ జర్నలిస్టులు బహిష్కరించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రెస్ కాన్పరెన్స్‌ను బాయ్‌కాట్ చేశారు. సాధారణంగా సచివాలయంలోకి జర్నలిస్టులను అనుతిస్తారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త నిబంధనలు పెట్టింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా గదిలో వేచి ఉండాలని సచివాలయ అధికారులు తెలపడంతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.
సత్యేంద్ర జైన్ ప్రెస్‌మీట్‌ను కవర్ చేసేందుకు జర్నలిస్టులు నిరాకరించారు. ప్రెస్‌మీట్‌కు సత్యేంద్ర రెండున్నర గంటల ఆలస్యంగా రావడంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సచివాలయంలోకి అనుమతించకపోవడంపై మంత్రిని నిలదీశారు. అయితే తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేసేందుకు పాటు పడుతోందని, ఏమీ దాచి పెట్టడం లేదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనీష్ సిసోడియా.. ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ విలేకరులతో అన్నారు.