త్వరలో 4జీ, వైఫై సేవలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ‘మెట్రో పొలిస్’ సదస్సుకు సమయం దగ్గర పడుతుండటంతో ఆలోగా ఎంపిక చేసిన మార్గాల్లో (సదస్సు వేదిక.. నగరానికి వచ్చే విదేశీ ప్రతినిధులు విడిదిచేసే హోటళ్లు.. సందర్శించే పర్యాటక ప్రదేశాల్లో) 4జీ, వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా రిలయన్స్ సంస్థకు జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. అక్టోబర్‌లో ‘మెట్రో పొలిస్’ సదస్సు జరుగనున్నందున సెప్టెంబర్ నెలాఖరులోగా 4జీ సేవలకు అవసరమైన సహకారాలందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడం తెలిసిందే.
ప్రస్తుతం 310 కి.మీ.ల మేర అవసరమైన లైన్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ రిలయన్స్‌కు అనుమతించింది. దీనికోసం ఆయా మార్గాల్లో ఏర్పాటు చేసే పోల్స్ ఒక్కోదానికి రూ.వెయ్యి వంతున ఫీజుగా తాత్కాలికంగా నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని, ఆ మేరకు రిలయన్స్ నుంచి అండర్‌టేకింగ్ తీసుకున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. సమయం తక్కువగా ఉండడం... రోడ్ల తవ్వకాల వల్ల తలెత్తే ఇబ్బందులు.. వర్షాకాల సమస్యల దృష్ట్యా ప్రస్తుతానికి పోల్స్ ద్వారా ఏరియల్ కేబుల్స్‌తో ఈ సేవలు అందుబాటులోకి తేనున్నారు.
భూగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అందుబాటులోకి వచ్చేంతవరకు ఏరియల్ కేబుల్స్‌ను వినియోగిస్తారు. 4జీ, వైఫై సేవలు అందుబాటులోకి వస్తే ఒకే బిల్లుతో ఇంటర్నెట్, కంప్యూటర్, టీవీ, సెల్‌ఫోన్ సేవలన్నీ పొందవచ్చు. ‘మెట్రో పొలిస్’ సదస్సుకు హాజరయ్యే అతిథుల అవసరాల దృష్ట్యా తొలి దశలో వెస్ట్‌జోన్, సెంటర్జోన్లోని కొన్ని ప్రాంతాల ప్రజలకే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.