Conference of Parties
-
బొగ్గు వినియోగం వద్దు
గ్లాస్గో/లండన్: శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని యూకేలోని గ్లాస్గోలో జరిగిన భాగస్వామ్య పక్షాల (కాప్–26) శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వాతావరణ మార్పులు, వాటి దుష్ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యహాలపై చర్చించేందుకు గత రెండు వారాలుగా కొనసాగిన ఈ సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై ముసాయిదా తుది ప్రకటనను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. దీన్ని ఐక్యరాజ్యసమితి క్లైమేట్ ఛేంజ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పర్యావరణాన్ని, తర్వాత భూగోళాన్ని కాపాడుకోవాలంటే బొగ్గు వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని కాప్–26 సూచించింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంకా బొగ్గును ఉపయోగిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదని వెల్లడించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తుచేసింది. చాలావరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కర్బన ఉద్గారాలను నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానం లేదని తెలిపింది. శిలాజ ఇంధనాల వాడకాన్ని నిరుత్సాహపర్చాలని ఇందుకోసం, సబ్సిడీల్లో పెద్ద ఎత్తున కోత విధించాలని పేర్కొంది. కాప్–26లో ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 నుంచి 2 డిగ్రీల పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై చర్చించారు. కర్బన ఉద్గారాల తగ్గింపుపై కీలక ఒప్పందం భారత్ సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ), వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్(యూఎన్ఎఫ్సీసీసీ) మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. యూకేలోని గ్లాస్గోలో కాప్–26 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా శుక్రవారం ఈ అవగాహనా ఒప్పందంపై ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్, యూఎన్ఎఫ్సీసీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ఓవైస్ సర్మాద్ సంతకాలు చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి, నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తామని, తమవంతు సహకారం అందిస్తామని ఐఎస్ఏ హామీ ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా.. దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, క్లీన్ ఎనర్జీ వినియోగానికి పెద్దపీట వేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్నదే లక్ష్యమని అజయ్ మాథుర్ చెప్పారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సౌర కూటమిని 2015 నవంబర్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. -
భూగోళానికి పెనుముప్పు
గ్లాస్గో: వాతావరణ మార్పుల కారణంగా భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, ప్రపంచ దేశాలు తక్షణమే మేలుకొని, దిద్దుబాటు చర్యలు ప్రారంభించకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. స్కాట్లాండ్లో గ్లాస్గో నగరంలోని స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్‌లో ఆయన సోమవారం భాగస్వామ్య పక్షాల 26వ శిఖరాగ్ర సదస్సులో (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) భాగంగా రెండు రోజులపాటు జరిగే ప్రపంచ దేశాల అధినేతల సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. బ్రిటన్ ఆతిథ్యం ఇస్తున్న కాప్–26 నవంబర్ 12 దాకా కొనసాగనుంది. సోమవారం భారత ప్రధాని మోదీ సహా దాదాపు 120 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రపంచం అంతం కాకుండా పోరాడే జేమ్స్‌బాండ్ ఆగమనం లాంటిదేనని బోరిస్ జాన్సన్ అభివర్ణించారు. అర్ధరాత్రి కావడానికి మరొక్క నిమిషం మాత్రమే ఉందని, మనం ఇప్పుడే ముందడుగు వేయాలని ఉద్బోధించారు. మాట తప్పితే ప్రజలు క్షమించరు 2015లో పారిస్‌లో జరిగిన కాప్ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఏకాభిప్రాయం సాధించడంతోపాటు కర్బన ఉద్గారాలకు కత్తెర వేసే దిశగా కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి గ్లాస్గోలో కాప్–26 నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పుల ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను జాన్సన్ గుర్తుచేశారు. పాలకులు ఇస్తున్న హామీలన్నీ నీటి మూటలవుతున్నాయని థన్‌బర్గ్ ఆరోపించారని అన్నారు. మాట తప్పితే ప్రజలు మనల్ని క్షమించబోరని చెప్పారు. ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ భారత్‌లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 750 మిలియన్ పౌండ్లు విడుదల చేయడానికి ప్రపంచ బ్యాంక్‌కు ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది. క్లీన్ ఎనర్జీ, రవాణా, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రీన్ ప్రాజెక్టులకు ప్రైవేట్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ గ్రూప్ నుంచి 210 మిలియన్ పౌండ్ల రుణ సాయం అందిస్తామని యూకే ప్రకటించింది. తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలి: బైడెన్ గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేతులు కలపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడానికి సమయం లేదని, తక్షణమే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. ఆయన కాప్–26లో మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాలను నివారించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో ప్రపంచ దేశాలకు మరింత సాయం చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. 2050 నాటికి అమెరికాను క్లీన్ ఎనర్జీ దేశంగా మారుస్తామంటూ జో బైడెన్ ప్రభుత్వ యంత్రాంగం తన ప్రణాళికను విడుదల చేసింది. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం పట్ల జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయన కాప్ సదస్సుకు క్షమాపణ చెప్పారు. -
ఎడారి కమ్ముకొస్తోంది
భారత దేశంలో నేలతల్లి నెర్రలు విచ్చుకుంటోంది. పచ్చదనంతో కళకళలాడుతూ వ్యవసాయానికి ఉపయోగపడాల్సిన భూమి ఎందుకూ పనికి రాకుండా ఎడారిగా మారిపోతోంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తాజా అంచనాలు, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ నివేదిక ప్రకారం భారత్‌లో 90 శాతం రాష్ట్రాల్లో ఎడారీకరణ విస్తరించింది. దీంతో వ్యవసాయ రంగం కుదేలైపోతోంది. భారత్‌లో 328.72 మిలియన్ హెక్టార్ల భౌగోళిక ప్రాంతం ఉంటే అందులో 96.4 మిలియన్ హెక్టార్ల ప్రాంతం ఎడారిగా మారిపోయింది.అంటే 30శాతం భూమి ఎందుకూ పనికి రాకుండా పోయిందన్న మాట. మొత్తం 29 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల్లో గత పదేళ్లలో ఎడారి ప్రాంతం బాగా పెరిగింది. ఎనిమిది రాష్ట్రాలో పరిస్థితి మరీ ఘోరం. 40–70% ఎడారిగా మారిపోయిందని ఆ నివేదిక వెల్లడించింది.. రాజస్థాన్, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజురోజుకీ సారవంతమైన భూములు తగ్గిపోతున్నాయి. ఇక మిజోరంలో లంగ్లే ప్రాంతంలో నేల పెళుసుబారడం మరీ ఎక్కువగా పెరిగిపోతోంది. 5.8శాతంగా ఇది ఉంది. 2003–2011 మధ్యలో అత్యధికంగా1.8 మిలియన్ హెక్టార్ల భూమి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ 14.35 శాతం , తెలంగాణలో 31.40 శాతం భూములు నిరుపయోగంగా మారాయి. ఏపీలో అనంతపురం జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం కురిసిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. తెలంగాణలో నల్లగొండ జిల్లాలో అధికంగా ఎడారీకరణ జరుగుతోంది. ఎందుకీ పరిస్థితి ? నీటి వనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా ఉత్పాదక భూమి పంటలు పండడానికి అనుగుణంగా లేకపోవడాన్నే ఎడారీకరణ అంటారు. దీని కారణంగా నీటి వనరులు తగ్గిపోతాయి. మొక్కలు పెరగవు. వన్యప్రాణులకు స్థానం ఉండదు. ఎడారిలో పూలు పూస్తాయా ! దేశంలో ఎడారీకరణ తగ్గిస్తామని భారత్ ఐక్యరాజ్య సమితి సదస్సులో 1994లోనే సంతకాలుచేసింది. 2030 నాటికి వ్యర్థంగా మారిన భూముల్ని సాగుకు అనుగుణంగా చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ సెప్టెంబర్‌లో భారత్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పద్నాలుగో సదస్సు (కాప్–14)కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు సందర్భంగా వచ్చే మూడున్నరేళ్లలోనే ఎంపిక చేసిన రాష్ట్రాలైన హర్యానా, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, నాగాలాండ్ అటవీభూముల్ని పెంచుతామని హామీ ఇవ్వనుంది. నీటి వనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, భూ సార పరిరక్షణ, జీవవైవిధ్యం పెంపు వంటి చర్యల ద్వారా భారత్ ఎడారిలో పూలు పూయించనుంది. -
భూతాపంపై యుద్ధం
భూతాపం పెరుగుతోంది.. ప్రకృతి ప్రకోపిస్తోందనే ప్రకటనలే తప్ప ఇన్నాళ్లూ ఈ దిశగా ప్రపంచ దేశాలు చేసిన ప్రయత్నం తక్కువే. దీంతో ఏడాదికేడాది వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయే తప్ప సానుకూల ఫలితాలు వస్తున్న దాఖలాలే కనిపించటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో యాభై ఏళ్లలో ప్రపంచ చిత్రపటమే మారిపోనుంది. ఈ నేపథ్యంలో.. మారుతున్న వాతావరణ పరిస్థితులపై సమరశంఖం పూరించేందుకు ప్రపంచం సిద్ధమైంది. నేటినుంచి పారిస్‌లో జరగనున్న కాప్-21 సదస్సులో భారీ నిర్ణయాలు తీసుకునేందుకు ఐక్యరాజ్యసమితి ఏర్పాట్లు చేసింది. ఇకపై ప్రపంచదేశాలు వేసే ప్రతి అడుగూ పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకునే వేసేలా పలు ఒప్పందాలకు రూపకల్పన జరగనుంది. ఈ పారిస్ సదస్సు ప్రత్యేకతలు, లక్ష్యాలు, భారత్ పాత్ర వంటి అంశాలను ఓసారి గమనిస్తే.. * పర్యావరణ మార్పుపై పారాహుషార్! * నేటి నుంచి పారిస్‌లో కాప్-21 కాప్ - 21 అంటే? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ను క్లుప్తంగా కాప్ అని పిలుస్తారు. ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్నది 21వ సదస్సు. దాదాపు 190 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో (ఒక్కో దేశం ఒక్కో పార్టీ అన్నమాట) భూతాపోన్నతి ప్రభావంతో వాతావరణ మార్పుల రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని నివారించే చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో ఓ ఒప్పందం జరగనుంది. నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబరు 11వ తేదీ వరకూ ఈ సదస్సు జరగనుంది. ఎందుకు ఇంత ప్రాముఖ్యత? ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అకాల వర్షాలు, వరదలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులోనూ.. ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్లకోసారి కాప్ సదస్సు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ జరిగిన సదస్సులు ఒక ఎత్తై.. ఫ్రాన్స్‌లో జరగనున్న ఈసారి కాప్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ సదస్సులో 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీల కంటే ఎక్కువగా పెరగకుండా ఉండేం దుకు ఏం చేయాలనే దానిపై 190 దేశాల ప్రతినిధుల మధ్య కీలకమైన ఒప్పందం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న ఈ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత కూడా చాలా ప్రమాదకరమే. చాలా దేశాలు, పెద్ద దేశాల్లోనూ తీర ప్రాంతాల్లోని కీలక పట్టణాలు కనుమరుగయ్యేందుకు ఇది కారణం కానుంది. ఇది తమను తీవ్రంగా నష్టపరుస్తుందని, దేశాలకు దేశాలు సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని కొన్ని చిన్న ద్వీప దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఏ లక్ష్యానికి కట్టుబడతాయి? అగ్రరాజ్యాలు కొత్త ఒప్పందం సక్రమంగా అమలయ్యేందుకు ఎంతమేరకు ఆర్థిక సహకారం అందిస్తాయన్నది ఈ సదస్సులో కీలకం కానుంది. సదస్సు సాధించేదేమిటి? అంతర్జాతీయంగా అన్ని దేశాలు చట్టపరంగా కట్టుబడే ఒప్పందాన్ని రూపొందించాలన్నది ఈ సదస్సు లక్ష్యం. గత కాప్ సదస్సులతో పోలిస్తే ఈ సదస్సు మరింత అర్థవంతంగా జరుగుతుందనేందుకు ఈ లక్ష్యం ఒక ఉదాహరణ. అన్ని దేశాల మధ్య ఇలాంటి ఓ భారీ ఒప్పందం జరిగే విధంగానే ఐక్యరాజ్యసమితి ఏర్పాట్లు చేసింది. తొలిరోజు నుంచి దేశాధినేతలందరూ సదస్సుకు హాజరయ్యేలా చేయడం ఇందులో భాగమే. మన పరిస్థితి ఏమిటి? పారిస్ సదస్సులో మరో ముఖ్య భాగం ‘ఇన్టెండెడ్ నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్స్’ (ఐఎన్డీసీ). అంశం. సదస్సులో పాల్గొనే దేశాలు తమతమ స్థాయిలో కర్బన ఉద్గారాలను ఎంత శాతం మేరకు తగ్గించుకుంటాయన్నది ఐఎన్డీసీ ద్వారా వెల్లడవుతుంది. భారత్ గత నెల మొదటి వారంలో ఐక్యరాజ్యసమితికి తన ఐఎన్డీసీ లక్ష్యాల పూర్తి వివరాలను సమర్పించింది. వాటి ప్రకారం 2030 నాటికల్లా కర్బన ఉద్గారాలను 33 నుంచి 35 శాతం వరకూ తగ్గించుకుంటామని భారత్ తెలిపింది. ఇది 2005 సంవత్సర నాటి స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా నిర్ణయమవుతుంది. ఈ క్రమంలో 2030 నాటికి దేశంలోని మొత్తం విద్యుదుత్పత్తిలో 40 శాతం సౌర, పవన వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా జరిగేలా చూస్తామంటూ ఐరాసకు హామీ ఇచ్చింది.