కల్లు కాదు కాలకూటం
- మెతుకు సీమలో అక్రమ దందా
- కల్లు వ్యాపారంలోకి మాఫియా
- కాంట్రాక్టర్ల గుప్పిట్లో సొసైటీలు
- కల్లు కల్తీ చేసి అక్రమ రవాణా
- విచ్చలవిడిగా అనుమతిలేని కల్లు దుకాణాలు
- మామూళ్ల ‘మత్తులో’ఎక్సైజ్ శాఖ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో 468 టీసీఎస్‌లు (టాడీ కోఆపరేటివ్ సొసైటీ), 673 టీఎఫ్టీలు(ట్రీ ఫర్ ట్యాపర్) ఉన్నాయి. వాస్తవానికి సొసైటీలు ఎన్ని ఉంటే దుకాణాలు కూడా అన్నే ఉండాలి. కానీ జిల్లాలో 2 వేలకు పైగా కల్లు దుకాణాలు అక్రమంగా నడుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే ఎక్సైజ్ రికార్డుల్లో కల్లు దుకాణం మూసివేసినట్లు ఉండగా.. దుకాణం మాత్రం నడుస్తూనే ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒక్క టీసీఎస్‌కు ఏఏ గ్రామాల పరిధిలో ఎన్ని ఈత, తాటి చెట్లను కేటాయించారు? వాటి నుంచి రోజుకు ఎంత కల్లు ఉత్పత్తి అవుతుంది? అనే వివరాలను నమోదు చేయాలి. సమాచార స్పష్టత కోసం ఈత, తాటి చెట్లకు నంబర్లు ఇవ్వాలి. కానీ ఎక్సైజ్ అధికారుల వద్ద ఎలాంటి నివేదికలు లేవు.
వాస్తవ పరిస్థితి ఇలా..
వాస్తవ పరిస్థితిని అంచనా వే సేందుకు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేయగా... దుబ్బాక మండలం ఆకారం గ్రామ కల్లు సొసైటీకి అదే గ్రామంలో 1,100 ఈత చెట్లు, 100 తాటిచెట్లు, గోసాన్‌పల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో 550 ఈత చెట్లు, 50 తాటి చెట్లు కేటాయించారు. ఏడాది కాలానికి గాను ఈ చెట్ల నుంచి కల్లును తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఆయా గ్రామాల్లోని చెట్ల నుంచి లభించే కల్లు ఎక్కువగా ఉంటోందని, కల్లు అమ్మకాలు తక్కువగా ఉన్నాయని చూపుతూ ఇక్కడి కల్లును సిద్దిపేట సొసైటీకి విక్రయిస్తున్నారు. నిజానికి అక్కడి చెట్ల నుంచి ఉత్పత్తి అవుతున్న స్వచ్ఛమైన కల్లు 50 నుంచి 70 లీటర్లకు మించి లేదు. ఈ కల్లు ఆకారం గ్రామ సొసైటీకే సరిపోదు. కానీ కారని కల్లును కారినట్లు చూపిస్తున్నట్లు తేలింది. పైగా కల్లు నిల్వ చేయడానికి ఉపయోగించాల్సిన కల్లు డిపోలనే కల్లును కల్తీ చేసే కేంద్రాలుగా వాడుకుంటున్నారు.
తయారీ ఇలా
10 లీటర్ల స్వచ్ఛమైన కల్లుకు 150 లీటర్ల నీళ్లు కలుపుతారు. మత్తు కోసం ఆల్ఫ్రోజోలం, డైజోఫాం, క్లోరో హైడ్రెడ్ తదితర నిషేధిత మత్తు రసాయనాలను కలుపుతారు. మొత్తం మిశ్రమాన్ని ఒక పెద్ద నీటితొట్టిలో పోసి బాగా కలియ తిప్పుతారు. రుచి కోసం తియ్యగా ఉండే చాక్రిన్, నురగ కోసం అమ్మోనియం మిశ్రమ రసాయనాలను, సోడా యాష్, కుంకుడుకాయ రసం కలిపి మరోసారి కలియతిప్పుతారు. ఇలా ఉదయం వేళ తయారు చేసిన మిశ్రమానికి ఈస్ట్ కలిపి సాయంత్రం వరకు బాగా పులియ బెడతారు. ఆ తర్వాతట్రేలలో పెట్టి కల్లు దుకాణాలకు చేరవేస్తున్నారు. కొన్ని దుకాణాల్లో మత్తు పదార్థాల గాఢత సరిపోని వారికి అదనంగా డైజోఫాం పొడి ఇస్తున్నారు. జనం కల్లు తాగి పొడి డైజోఫాంను నాకుతున్నారు.
మహారాష్ట్ర నుంచి ‘డైజోఫాములు’
కల్తీలో మత్తుకోసం వినియోగిస్తున్న డైజోఫాం, ఆల్ఫ్రోజోలం లాంటి ప్రమాదకరమైన నిషేధిత మత్తు పదార్థాలను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసం జిల్లాలో ప్రత్యేక మాఫియా ముఠాలు కూడా చురుగ్గా పని చేస్తున్నాయి. పారిశ్రామిక వాడల్లోని ఔషద తయారీ పరిశ్రమల నుంచి వీటిని అక్రమంగా సేకరించి, జహీరాబాద్ చెక్ పోస్టు మీదుగా జిల్లాకు తరలిస్తున్నారు.
నిజానికి ఇలాంటి నిషేధిత మత్తు పదార్ధాలను నిరోధించడానికి ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ అనే ప్రత్యేక విభాగం ఉంది. దీన్ని జిల్లా స్థాయిలో అసిస్టెంటు కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తుంటారు. మామూళ్లకు అలవాటు పడిన ఈ విభాగం అధికారులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణపై నిఘా పెట్టడం మానేసి, అక్రమ వసూళ్లకు తెర లేపి డ్రగ్స్ మాఫియాను వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కేసులు గీత కార్మికులకు... కాసులు కాంట్రాక్టర్లకు
మెతుకు సీమ కల్లు సొసైటీలు కల్లు మాఫియా డాన్ బాలరాజ్ గౌడ్ శిష్యుల గుప్పిట్లోనే ఉన్నాయి. అయితే ఆయనకు ఇక్కడి వ్యాపారంతో సంబంధం లేదని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. మేజర్ కల్లు సొసైటీల గుప్పిట్లో ఉంచుకున్న బడా కాంట్రాక్టర్ల, చిన్న చిన్న సొసైటీలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అనుమతించిన కల్లు డిపోల్లోనే కృత్రిమ కల్లు తయారుచేసి ట్రాలీలు, ఆటోలు, లారీల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తున్నారు.
నిజానికి గ్రామ కల్లు సొసైటీల్లో ఆయా గ్రామాలకు చెందిన గీత కార్మికులే అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్నారు. కానీ కల్లు సొసైటీలో విక్రయాలు మాత్రం కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి. సొసైటీలకు ఏడాది కొంత సొమ్ము ముట్టజెపుతున్న కల్లు కాంట్రాక్టర్లు వాటిని హస్తగతం చేసుకుంటున్నారు. వీటి ద్వారా కృత్రిమ కల్లు అమ్ముతున్నారు. డిమాండ్‌ను బట్టి సీసా కల్లుకు రూ.10 నుంచి రూ.15 వరకు తీసుకుంటున్నారు. రసాయనాలు కలపడంలో తేడా వచ్చి మరణాలు సంభవిస్తే ఎక్సైజ్ అధికారులు మాత్రం గీత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. కాసులు మాత్రం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయి.
లెసైన్స్‌ల కంటే రెట్టింపు స్థాయిలో దుకాణాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం లెసైన్స్ ఉన్న వారే కల్లు అవ్ముకాలు కొనసాగించాలి. ఏ గ్రామంలో చూసినా మూడు నుంచి నాలుగు కల్లు దుకాణాలు కనిపిస్తాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లోని గ్రామాల్లో ఒక గ్రామానికి ఒక లెసైన్సు తీసుకుని నాలుగైదు దుకాణాలు నిర్వహిస్తున్నారు. కానీ ఒక దుకాణానికి మాత్రమే ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తారు.
ప్రస్తుతం ఉన్న లెసైన్సుల కంటే రెట్టింపు స్థాయిలో దుకాణాలు ఉన్నాయి. లెసైన్సు కలిగిన దుకాణాల్లో కల్తీ కల్లు కేసులు నమోదైనట్లయితే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. కానీ లెసైన్సులు లేని దుకాణాల్లో విక్రయించిన కల్లు కల్తీ అయి ప్రాణాలు పోయినప్పుడు, ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసే సమయంలో దుకాణాలను తొలగిస్తారు.
శాంపిల్స్ సేకరణలోనే మోసం...
జిల్లాలో ఎక్సైజ్ అధికారుల అండతోనే కల్లు దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. నిబంధన ప్రకారం ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు కల్లు దుకాణాలు తనిఖీ చేసి, శాంపిల్స్ సేకరించాలి. ఈ శాంపిల్స్ హైదరాబాద్‌లోని లేబ రేటరీకి పంపించి పరీక్షలు చేయించాలి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్సైజ్ అధికారులు 57 శాంపిల్స్ సేకరించగా, కేవలం రెండు శాంపిల్స్‌లో మాత్రమే కల్తీ నిర్ధారణ అయింది.
నిజానికి ఎక్సైజ్ అధికారులు దుకాణంలోంచి ఇష్టం వచ్చిన సీసాను తీసుకొని దానిలో కల్లు శాంపిల్స్ తీసుకోవాలి. వాస్తవానికి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోంది. ఎక్సైజ్ అధికారులు శాంపిల్స్ పంపమని కల్లు దుకాణం యజమానికే చెప్తున్నారు. వాళ్లు స్వచ్ఛమైన కల్లు తీసి ఎక్సైజ్ అధికారులకు పంపిస్తున్నారు. దీంతో ప్రయోగశాలలో కల్లు కల్తీ నిర్ధారణ కావట్లేదు.
కల్తీ కల్లు ప్రాణాంతకం
కల్తీ కల్లు తాగడం ప్రాణాంతకం. ప్రస్తుత పరిస్థితుల్లో సహజసిద్ధమెన కల్లు దొరక్క చాలామంది కృత్రిమ కల్లుకు అలవాటు పడుతున్నారు. దీంతో వారికి తెలియకుండానే ఆరోగ్యం క్షీణిస్తోంది. కల్లులోని ప్రాణాంతక పదార్థాలైన డైజోఫాం, ఆల్ఫ్రోజోలం, క్లోరోఫాం తదితర మత్తు పదార్థాలు నాడీ వ్య వస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కళ్లు పోవడం, మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మూత్రపిండాల వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది.