రెండు నెలల బడ్జెట్‌కు ఓకే
గవర్నర్ ఆమోదం..
సంచిత నిధి నుంచి వినియోగం
డిసెంబర్ 2 వరకు వినియోగించుకునే అవకాశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ రెండో తేదీ నుంచి డిసెంబర్ రెండో తేదీ వరకు సంచిత నిధి నుంచి రూ.16,890.85 కోట్లు వ్యయం చేయడానికి గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. దీనితో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తరువాత అప్పట్లో గవర్నర్ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు దాదాపు రూ. 26,573 కోట్లను సంచిత నిధి నుంచి వినియోగించుకోవడానికి అనుమతించారు. అక్టోబర్ రెండో తేదీలోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభను సమావేశపరిచి బడ్జెట్‌కు ఆమోదం పొందాల్సి ఉండింది. అయితే విభజన చట్టంలో ఆరు నెలల కాలానికి సంచిత నిధి నుంచి పాలన, వేతనాలు ఇతర వ్యయానికి గవర్నర్ అనుమతిస్తే చాలన్న వెసులుబాటు ఉంది.
దీనితో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను వాయిదా వేశారు. రెండు నెలల కాలానికి సంచిత నిధి నుంచి నిధులు తీసుకోవడానికి వీలుగా మంత్రివర్గ సమావేశం లేకుండా.. సర్క్యులేషన్ పద్ధతిలో మంత్రుల వద్ద సంతకాలు తీసుకుని గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. ఈ రెండు నెలల వ్యయానికి గవర్నర్ అనువుతించడంతో ఆర్థిక శాఖ తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.