బ్రీఫ్స్
కాంటాక్ట్‌లెస్ ఫారెక్స్ కార్డు
దేశంలోనే తొలిసారిగా 15 విదేశీ కరెన్సీలను నింపుకునే కాంటాక్ట్‌లెస్ ఫారెక్స్ కార్డును యాక్సిస్ బ్యాంక్ ప్రవేశపెట్టింది. కార్డు స్వైపింగ్ చేయనవసరం లేకుండానే సెన్సర్‌తో పనిచేసే విధంగా రూపొందించిన ఈ కార్డుల ద్వారా ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లే ప్రయాణికులు మరింత సులభతరంగా, సురక్షితమైన లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. ఈ కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీని క్రెడిట్, డెబిట్‌కార్డుల్లో కూడా వినియోగిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది.
డెంగ్యూకి బీమా రక్షణ
ఈ మధ్యకాలంలో డెంగ్యూ జ్వరం బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో ఈ వ్యాధి చికిత్సా వ్యయాన్ని భరించడానికి కొత్త బీమా పథకం అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటురంగ ఆరోగ్య బీమా కంపెనీ అపోలో మ్యూనిక్ ‘డెంగ్యూ కేర్’ పేరుతో ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం రూ. 444 వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. డెంగ్యూ జ్వరం బారిన పడి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే గరిష్టంగా రూ. 50,000 వరకు, అదే హాస్పిటల్లో చేరకుండా ఔట్ పేషెంట్‌గా చికిత్స తీసుకుంటే రూ. 10,000 బీమా రక్షణ లభిస్తుంది. గతేడాది 40,000 కేసులు నమోదు కాగా సగటు చికిత్సా వ్యయం రూ. 35,000 ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.
ఎల్అండ్టీ మిడ్‌క్యాప్ డివిడెండ్
ఎల్అండ్టీ మ్యూచువల్ ఫండ్ సంస్థ మిడ్‌క్యాప్ పథకంపై 30% డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌కు రికార్డు తేదీ ఆగస్టు 19గా నిర్ణయించారు. ఈ తేదీ నాటికి కలిగి ఉన్న ప్రతీ యూనిట్‌కు రూ. 3 డివిడెండ్ లభిస్తుంది. గడిచిన ఏడాది కాలంలో 40 శాతం రాబడిని అందించిన ఈ పథకం యూనిట్ విలువ (డివిడెండ్) రూ. 40.86 గా ఉంది.
యూబీఐ నుంచి మూడు కార్డులు
ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న వ్యాపారులు, విద్యార్థులు, అధికాదాయ వర్గాల వారికోసం మూడు ప్రత్యేక కార్డులను ప్రవేశపెట్టింది. చిన్న వ్యాపారస్థుల కోసం డెబిట్ కార్డును, అలాగే అధికాదాయవర్గాల వారికోసం క్రెడిట్ కార్డును విడుదల చేసింది. దీంతోపాటు ఎటువంటి ఆదాయం, క్రెడిట్ రేటింగ్ లేని విద్యార్థుల కోసం యూ సెక్యూర్ పేరుతో క్రెడిట్ కార్డును అందిస్తోంది. కానీ ఈ కార్డు కావాలంటే మాత్రం విద్యార్థులు టర్మ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.