పండగపూటా పస్తులే
♦ కాంట్రాక్టు ఉద్యోగులకు 3 నెలలుగా వేతనాలు నిలుపుదల
♦ సంక్రాంతి పండుగ పూట ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: చంద్రన్న కానుకతో అందరూ పండగ చేసుకోండి అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం పండగలేకుండా చేసింది. మూడు నెలల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు నిలిపివేయడంతో వారింట్లో పండగ జాడేలేదు. నెల నెలా జీతమొస్తేగానీ ఇల్లు గడవని ఆ ఉద్యోగులు.. ఈ సారి సంక్రాంతిని జరుపుకోలేకపోతున్నామని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖలోని 3,500 మంది కాంటాక్టు ఉద్యోగులకు గత సెప్టెంబర్లో ఉద్యోగ కాలపరిమితి పొడిగించారుగానీ, జీతాలు మాత్రం ఇవ్వలేదు. దీంతో ఉద్యోగులు అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారుగానీ వేతనాలు మాత్రం అందలేదు.
సంక్రాంతి పండుగ నాటికైనా వస్తాయని వేలాది మంది ఎదురు చూశారు. ఇప్పటికీ ట్రెజరీల నుంచే బిల్లులు పాస్ కాలేదు. ఇవి ఇక జిల్లాలకు చేరేదెప్పుడు, అధికారులు వీళ్లకు జీతాలు ఇచ్చేదెప్పుడో అర్థం కాని పరిస్థితి. ఓవైపు తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అంగీకరించడం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచడం జరుగుతున్న పరిస్థితుల్లో ఏపీలో పరిస్థితిపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు లేక అల్లాడుతున్నాం
గత మూన్నెళ్లుగా వేతనాలు లేవు. కుటుంబం గడవడమే కష్టమైంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు బంధువులందరూ వస్తుంటారు. ఈ పరిస్థితుల్లో జీతం రాకపోతే ఏం చేయాలి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు.
-చటర్జీ, రత్నాకర్, ఏపీ పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ