ఐటీ గాలం
► కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి డైరీలో 12 మంది మంత్రుల వివరాలు
► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతిలో అక్రమార్కుల చిట్టా
► జాబితాలో 14 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌లు
► దాడులకు అనుమతి కోరిన ఢిల్లీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వంలోని అవినీతి తిమింగలాలను గాలం వేసి పట్టుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధం అవుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌కు అక్రమార్కుల చిట్టాను అందజేసిన ఐటీశాఖ ఉన్నతాధికారులు దాడులకు అనుమతి కోసం వేచి ఉన్నారు. ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డితో అక్రమ లావాదేవీలు నడిపి లబ్ధి పొందిన 12 మంది మంత్రుల మెడకు సైతం ఐటీ ఉచ్చు చుట్టుకోనున్నట్లు సమాచారం. తమిళనాడు ప్రభుత్వంలో ప్రజాపనులశాఖ ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై గత ఏడాది ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల నగదు, భారీ స్థాయిలో రూ.2000 కొత్త కరెన్సీ నోట్లు, బంగారం స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి శేఖర్రెడ్డితోపాటూ ఆయన వ్యాపార భాగస్వాములు శ్రీనివాసులు, ఆడిటర్ ప్రేమ్‌కుమార్, రత్నం, రామచంద్రన్, అశోక్, ఎం.జైన్, మహావీర్ గిరాణీ, పరాస్మల్ లోధా తదితర 8 మంది అరెస్టయ్యారు. శేఖర్‌రెడ్డి ఇళ్లపై దాడులు చేసిన సమయంలో రూ.300 కోట్ల విలువైన అక్రమాల వివరాలతో కూడిన డైరీ ఐటీ అధికారులకు లభించినట్లు తెలు స్తోంది. శేఖర్‌రెడ్డితో అక్రమ లావాదేవీలు జరిపిన వారిలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నా రు. అంతేగాక వారికి ఇచ్చిన కమీషన్ వివరాలు సైతం పొందుపరిచి ఉన్నాయి. డైరీలో లభించిన వివరాల ఆధారంగా ఒక్కొక్క పేరును బయటకు తీసి రహస్య విచారణ చేస్తున్నారు.
రాష్ట్రంలో నిషేధించిన పాన్ మసాలా, గుట్కా తదితర మత్తు పదార్థాలు రహస్య అమ్మకాలకు మార్గం సుగమం చేసి, కమీషన్ పుచ్చుకున్న సుమారు 50 మంది అధికారుల పేర్లు ఐటీ చేతుల్లో ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌కు ఐటీ శాఖ అందజేసి, తగిన చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా శేఖర్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా 14 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారుల ఇళ్లపై దాడులు జరిపేందుకు ఢిల్లీ ఐటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలో ఐటీ దాడులు సాగుతాయని అంటున్నారు.
గవర్నర్ విచారణకు స్టాలిన్ విజ్ఞప్తి
అన్నాడీఎంకే (అమ్మ) ప్రభుత్వంలోని మంత్రుల, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఇన్చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు సోమవారం ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ అవినీతి హిమాలయ పర్వతాల అంత ఎత్తుకు చేరుకుందని ఆయన విమర్శించారు. ఇసుక మాఫియా శేఖర్‌రెడ్డి ఇంటి నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పేర్లతో రూ.300 కోట్ల అవినీతి చిట్టా బయట పడిందని ఆయన చెప్పారు.
ఈ వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపి, తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులు కోరినట్లు ఆయన తెలిపారు. జయలలిత మరణించిన తరువాత 15 రోజుల్లో ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం బీమా బిల్లు కోసం రూ.808 కోట్ల నిధులను ఒకే సంతకంతో విడుదల చేయడం వెనుక దాగి ఉన్న అవినీతి ఇప్పటికే ఒక ప్రచార మాధ్యమం ద్వారా వెలుగు చూసిందని చెప్పారు. ఆహారశాఖా మంత్రి కామరాజ్, వైద్యమంత్రి విజయభాస్కర్, కొందరు అధికారులపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నందున విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
వివరాలు విడుదల చేయాలి
కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి నుంచి అక్రమంగా లబ్ధి పొందిన మంత్రులు, అధికారుల జాబితాను విడుదల చేయాలని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ను సోమవారం ఒక ప్రకటనలో కోరారు.