రిషితేశ్వరి కేసులో ముగిసిన కమిటీ విచారణ
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ బుధవారంతో ముగిసింది. ఈ కమిటీ గత నెల 29, 30, 31 తేదీల్లో వర్సిటీలో విచారణ నిర్వహించిన విషయం విదితమే. విద్యార్థులకు సెలవులు ఇచ్చిన సమయంలో విచారణ జరపటంపై విమర్శలు వెల్లువెత్తటంతో.. సెలవులు ముగిసిన తర్వాత ఒక్కరోజు (ఈ నెల 5న) విచారణ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే నలుగురు సభ్యుల కమిటీ బుధవారం వర్సిటీలో విచారణ జరిపింది.
ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సాగిన విచారణలో ఆర్కిటెక్చర్ విద్యార్థులకు కమిటీ అధిక సమయం కేటాయించింది. విద్యార్థులతో తరగతుల వారీగా సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించింది. రిషితేశ్వరి అన్నయ్య అని పిలిచే బీఆర్క్ విద్యార్థి జితేంద్రను కమిటీ సభ్యులు సుదీర్ఘంగా విచారించారు. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య జి.బాబురావు కూడా కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈనెల 10వ తేదీలోగా ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కమిటీ కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.