హామీలు గాలికొదిలిన చంద్రబాబు
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ
కొత్తచెరువు : రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు..విదేశీ మోజుతో విమానాలను బాడుగలకు తీసుకుని తిరుగుతున్న దగాకోరుకు రైతుల కష్టాలేం కనబడతాయని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకర్‌నారాయణ విమర్శించారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో శంకర్‌నారాయణ మాట్లాడారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ ఇంటర్నెట్లో కాగితాలకే పరిమితమైందన్నారు. ఇప్పటి వరకు కొత్తరుణాలు కానీ, రుణమాఫీ చేసిన దాఖలాలు లేవన్నారు.
ఉపాధి కరువై పొట్ట నింపుకోవడానికి బెంగుళూరుకు వలసలు పోయే దుస్థితి ఏర్పడిందన్నారు. రైతులు పంటల సాగు కోసం అప్పులు చేసి, అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం పనీపాట లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రైతులు, చేనేత కార్మికుల సమస్యలపై అసెంబ్లీ గట్టిగా పోరాడుతున్నారని తెలిపారు. కరువుతో అల్లాడుతున్న జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హంద్రీ నీవా ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు తెప్పించేందుకు అప్పట్లో రూ.5,800 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు.
ఆయన చేపట్టిన పనులను ప్రస్తుత టీడీపీ నేతలు తామే చేసి నీరు తెప్పిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పార్టీ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జి కొత్తకోట సోమశేఖర్‌రెడ్డి ప్రసంగించారు. పార్టీ మండల కన్వీనర్ నారేపల్లి జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ మాణిక్యం బాబా, మాజీ సర్పంచ్ లోచర్ల రాజారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, రెడ్డప్పరెడ్డి, గూడూరు శ్రీనివాసులు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వాల్మీకి శంకర్, ఉపసర్పంచ్ వెంకటరాముడు, నేతలు అలివేలమ్మ, సంజీవరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి,మాణిక్యం షౌకత్ అలీ, యల్లప్ప పాల్గొన్నారు.