సీఎం చంద్రబాబు రాక
సాక్షి, గుంటూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 23న ప్రత్తిపాడులో డ్వాక్రా సదస్సు, 24న పెదకూరపాడులో రైతు సదస్సు నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటనపై మంగళవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు...
= ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారు లను ఆదేశించారు.
= 23న ప్రత్తిపాడులో జరిగే డ్వాక్రా సదస్సుకు 30 వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని ఆదేశించారు.
= అదే రోజు సాయంత్రం గుంటూరులోని జిల్లా పరిషత్ సమావేశ మంది రంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. అధికారులు విధిగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్‌కు సిద్ధం కావాలన్నారు.
= సీఎం పర్యటన ముగిసే వరకు వారం రోజులపాటు ఉద్యోగులకు సెలవు మంజూరు చేయవద్దని ఆదేశించారు.
= ఈ సదస్సు ముఖ్య బాధ్యతలను డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతి, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ ఢిల్లీరావు, గుంటూరు ఆర్డీఓ భాస్కర నాయుడులకు అప్పగించినట్టు తెలిపారు.
పెదకూరపాడులో రైతు సదస్సు
= 24న పెదకూరపాడులో రైతు సదస్సు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌ను ఆదేశించారు.
= ఇక్కడ కూడా 30 వేల మందికి తగ్గకుండా రైతులను సమీకరించాలన్నారు. సదస్సు నిర్వహణకు తగిన స్థలాన్ని ఎంపిక చేసి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.
= బహిరంగవేదికకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి 23వ తేదీ రాత్రి గుంటూరులో బస చేసే అవకాశం ఉందన్నారు.
= {పత్తిపాడు, పెదకూరపాడు సదస్సుల ఆవరణల్లో టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు.
= రెండు సదస్సుల్లో, ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
= ఆ రెండు రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు.
= ముఖ్యమంత్రి పర్యటించే మార్గమధ్యలో వివిధ శాఖల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. సదస్సుల్లో స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు.
= పెదకూరపాడు సదస్సు సమన్వయకర్తగా ఆర్డీవో మురళికి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, డీఆర్వో నాగబాబు, అన్ని శాఖల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.