convention farmers
-
16న షాబాద్‌లో డాక్టర్ ఖాదర్ ప్రసంగం
అటవీ కృషి నిపుణులు, ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార–ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 16(ఆదివారం)న రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ధ్యానహిత హైస్కూల్ ఆవరణలో జరిగే సదస్సులో ప్రసంగిస్తారు. ఉ. 9.30 గం. నుంచి మ. 1 గం. వరకు సదస్సు జరుగుతుందని ధ్యానహిత సొసైటీ డైరెక్టర్ డా. ఎన్. శైలజ తెలిపారు. అటవీ చైతన్య ద్రావణంతో మెట్ట భూముల్లో కొర్రలు, అరికలు వంటి సిరిధాన్యాలను వర్షాధారంగా రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో సాగు చేసుకునే పద్ధతులు.. సిరిధాన్యాలను రోజువారీ ప్రధానాహారంగా తింటూ షుగర్, ఊబకాయం, రక్తహీనత, కేన్సర్ తదితర ఏ జబ్బులనైనా పూర్తిగా తగ్గించుకునే పద్ధతులను డా. ఖాదర్ వివరిస్తారు. అనంతరం ప్రశ్నలకు బదులిస్తారు. 16వ తేదీ సా. 6 గం.లకు డా. ఖాదర్ ధ్యానహిత స్కూల్ ఆవరణలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. రైతులు, మహిళలు, పురుషులు, యువతీయువకులు ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం. డా. ఖాదర్ తయారు చేసిన అటవీ చైతన్య ద్రావణాన్ని 300 మంది రైతులకు ఈ సందర్భంగా ఉచితంగా పంపిణీ చేస్తారని డా. శైలజ వివరించారు. మిక్సీతో సిరిధాన్యాల బియ్యం తయారీపై శిక్షణ కొర్రలు తదితర సిరిధాన్యాలను నూర్చిన తర్వాత మిక్సీతో సులువుగా పొట్టు తీసే పద్ధతిపై 16వ తేదీ సా. 3–5 గం.ల మధ్య రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ధ్యానహిత హైస్కూల్ ఆవరణలో డా. ఖాదర్, బాలన్ కృష్ణ రైతులు, మహిళా రైతులు, గృహిణులకు ఆచరణాత్మక శిక్షణ ఇస్తారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 86398 96343, 94406 65151. -
్ఠరుణమో రామచంద్రా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కౌలుదారులు ఆందోళన బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెనుగొండ మండలం సిద్ధాంతంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు తాళం వేశారు. భూ యజమానుల పేరిట కౌలు రైతులకు ఎగనామం భూ యజమాని తన పొలంపై అప్పు తీసుకుంటే.. ఆ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వారికి రుణం ఇవ్వడం లేదు. జిల్లాలో 70 శాతం భూముల్ని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. అయితే, ఆ భూముల్లో యజమానులే సాగు చేస్తున్నట్టు బ్యాంకు అధికారులే ధ్రువీకరిస్తూ వారికి రుణాలిస్తున్నారు. కౌలుదారులకు మాత్రం రిక్తహస్తం చూపుతున్నారు. వ్యవసాయ అధికారులు చేయాల్సిన పనిని బ్యాంకు అధికారులే చేయడం వల్ల నిజమైన కౌలు రైతులకు రుణం అందటం లేదు. 2011 భూ అధీకృత సాగుదారు చట్టం నిబంధనలకు ఇది వ్యతిరేకం. పంట వేసిన సాగుదారుకు మాత్రమే రుణం ఇవ్వాలి. పంటలు వేయని భూ యజమానులు పంట రుణాలు తీసుకునేందుకు అనర్హులు. వారికి వ్యవసాయేతర అప్పులు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. కానీ.. జిల్లాలో బ్యాంకు అధికారులు చట్టవిరుద్ధంగా రుణాలు ఇస్తున్నారు. పంటలు వేసిన కౌలు రైతులను బ్యాంకు గడప కూడా తొక్కనివ్వడం లేదు. కౌలుదారులకు పంట రుణాలు ఇవ్వని బ్యాంక్ మేనేజర్లను అరెస్ట్ చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించినా.. వారికి రుణాలివ్వని బ్యాంకులను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని ప్రభుత్వం ప్రకటించినా బ్యాంకర్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఆ బ్యాంక్ మేనేజర్ని ఎందుకు వదిలేశారు? పెనుగొండ మండలం సిద్ధాంతంలోని ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ఒక్క కౌలు రైతుకు కూడా అప్పు ఇవ్వలేదనేది రైతుల వాదన. కలెక్టర్ హెచ్చరికల ప్రకారం అతను ఎందుకు అరెస్ట్ కాలేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ అనేక సందర్భాలలో ప్రకటించారు. అయితే, తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదని బ్యాంక్ మేనేజర్లు చెబుతున్నారు. ఇచ్చింది అంతంతే జిల్లాలో 3.50 లక్షల మంది కౌలు రైతులు ఉండగా, 3.25 లక్షల మందికి రుణార్హత కార్డులు ఇచ్చామని అధికారులు ప్రకటించారు. అందులో సగం మందికి కూడా కార్డులు అందలేదు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నాటికి జిల్లాలో కేవలం 17,841 మందికి రూ.41.48 కోట్లను మాత్రమే కౌలు రైతులకు రుణాలుగా ఇచ్చారు. ఈ ఏడాది జిల్లా రుణ ప్రణాళిక రూ.6,300 కోట్లు కాగా, ఇప్పటికే 3,500 కోట్ల రుణాలిచ్చినట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. అందులో కేవలం రూ.41 కోట్లు మాత్రమే కౌలు రైతులకు దక్కాయి. ఈ పరిస్థితుల్లో బ్యాంకర్లు కొత్త సాకులు వెతకడం మొదలు పెట్టారు. కౌలు రైతులు బకాయిలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని, అందువల్లే రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం రూ.లక్ష వరకూ వడ్డీ లేని రుణాలు ఇవ్వవచ్చు. 4 ఎకరాలు కౌలు చేస్తే రూ.లక్ష పెట్టుబడి అవసరం అవుతుంది. ప్రైవేటు అప్పు తెచ్చుకుంటే ఏడాదికి రూ.24 వేల వరకూ వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. బ్యాంకులు వడ్డీలేని రుణమిస్తే ఆ మేరకు రైతుకు మిగులుతుంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూసినా రూ.లక్ష రుణం పొందిన కౌలు రైతు ఒక్కరు కూడా జిల్లాలో లేరు. వచ్చే వ్యవసాయ సీజన్ నుంచి రుణార్హత కార్డులు ఇచ్చేది లేదని, వ్యవసాయ శాఖ ద్వారా సాగు ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ శాఖ వద్ద భూముల రికార్డులు ఉండవు. ఆ కౌలు రైతు ఏ సర్వే నంబర్ భూమిలో సాగు చేస్తున్నాడో తెలియకుండా ఎలా రుణం ఇస్తారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఒక సర్వే నంబర్‌పై ఒకసారి అప్పు తీసుకుంటే.. దానిపై మరో రుణం ఇచ్చే పరిస్థితి లేనపుడు సర్వే నంబర్ లేని ధ్రువీకరణ పత్రాల ద్వారా రుణం ఎలా ఇస్తారని కౌలు రైతులు ప్రశ్నిస్తున్నారు.