రైతన్నకు శుభవార్త..
ఆన్లైన్ ద్వారా కొనుగోలు డబ్బుల చెల్లింపు
- అక్టోబర్ నుంచి అమలు
- పెరిగిన ధాన్యం మద్దతు ధర
రాయికల్ : జిల్లా రైతులకు శుభవార్త. అన్నదాతలు తాము పండించిన పంట ఐకేపీ, సహకార సంఘాల్లో అమ్మిన తర్వాత డబ్బులకోసం 15 నుంచి నెల వరకు వేచిచూసేవారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నేరుగా డబ్బులు ఆన్లైన్ ద్వారా తమ ఖాతాలో జమయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ఆన్లైన్ ద్వారా చెల్లింపుకు అక్టోబర్‌లో శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ నుంచి జిల్లాలో 301 ఐకేపీ కొనుగోలు సెంటర్లు, 320 సహకార సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సెంటర్లలో అమ్మిన రైతులకు కేవలం 48 గంటల్లోనే తమ అకౌంట్లోకి డబ్బులు జమయ్యేలా చర్యలు చేపడుతున్నారు.
గతంలో ఐకేపీ, సహకార కొనుగోలు సెంటర్లో అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు రాకపోవడం, బ్యాంకుల్లో గంటల తరబడి నిలబడటం, బ్యాంకులో సిబ్బంది సరిగా లేకపోతే ఆ డబ్బుల కోసం రోజుల తరబడి వేచిచూడడం వంటి సంఘటనలు జరిగాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు మొదటిసారిగా ఆన్లైన్ పేమెంట్‌ను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా రైతులు తమ బ్యాంక్ అకౌంట్, ఆధార్‌కార్డులను సంబంధిత మండల ఐకేపీ కార్యాలయంలో సమర్పించాలని, తద్వారా కంప్యూటరీకరణ చేసి ఆన్లైన్ అకౌంటింగ్ ద్వారా త్వరితగతిన రైతులకు తమ అకౌంట్లలో డబ్బులు పడే అవకాశం ఉంది.
పెరిగిన వరి మద్దతు ధర
అక్టోబర్ నుంచి ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు, సహకార కొనుగోలు కేంద్రాల ఆధ్వర్యంలో వరికొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. గతంలో ఏ గ్రేడ్ వరికి రూ.1345 ఉండగా.. ప్రస్తుతం రూ.1400లకు కామన్ గ్రేడ్ రూ.1310 ఉండగా.. రూ.1360కి పెంచిందని ఐకేపీ అధికారులు తెలిపారు.