Corporate badminton league
-
సెమీస్‌లో అదితి, మోహన్
కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ సాక్షి, హైదరాబాద్: సీడీకే గ్లోబల్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్‌లో అదితి, మోహన్ సుబ్బరాయన్ సెమీస్‌లోకి ప్రవేశించారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో శనివారం జరిగిన పురుషుల క్వార్టర్స్‌లో మోహన్ (జెన్సర్ టెక్నాలజీస్) 21-16, 21-5తో విశ్వాస్ గురంగ్‌పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అదితి 21-6, 21-7తో మనూష పొన్నంపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో వేదశ్రీ (సిస్కో) 21-15, 21-09తో ఆస్థా సక్సేనాపై, పల్లవి అపర్ణ (ఒరాకిల్) 21-12, 21-11తో వాసవిపై, ఆనీ జార్జ్ (టీసీఎస్) 21-4, 21-6తో పూనమ్‌పై గెలిచారు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు పురుషుల సింగిల్స్ : హర్ష 21-10, 21-13తో అమిత్ క్రిస్టియన్ షనోరిపై, ఉదయ్ తిరువనల్లూర్ 21-14, 21-15తో అరుణ్ కుమార్‌పై, ఆదర్శ్ 21-18, 21-18తో మనీశ్ కుమార్‌పై నెగ్గారు. పురుషుల డబుల్స్: కిరణ్ (ఐసీఐసీఐ)- విశ్వనాథ్ (ఐబీఎం) జంట 21-8, 21-16తో అనిల్- సిజో (టీసీఎస్) జోడీపై, అవినాశ్- వంశీకృష్ణ (విప్రో) జంట 21-15, 21-19తో రవి కిరణ్ (సెంచురీ హాస్పిటల్స్)- రవి (మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స) జోడీపై, ప్రవీణ్- రఘు (విప్రో) జంట 21-17, 20-21, 21-18తో రాజశేఖర్- శ్రీకీర్తి వోరుగంటి (వాల్యూ ల్యాబ్స్)పై, ఆదర్శ్ (హెచ్‌పీ)- మోహన్ (జెన్సర్) జంట 15-14, 15-14తో గోపీకృష్ణ (టెక్‌మహీంద్ర)- హర్ష జోడీపై విజయం సాధించారుు. మహిళల డబుల్స్: ఆనీ జార్జ్ (టీసీఎస్)- సౌమ్య (అమెజాన్) జంట 21-7, 21-8తో మితా - షీతల్ (పీఎన్జీ) జోడీపై, రమ్య- స్నేహ జంట 21-12, 21-16తో అఖీఫా సామియా- అన్నపూర్ణ (సీడీకే) జోడీపై, ఆస్థా సక్సేనా- దీప్తి (ఇన్ఫోసిస్) జంట 21-5, 21-10తో రమ్య- సౌజన్య జోడీపై గెలుపొందారుు. మిక్స్డ్ డబుల్స్: మోహన్- అదితి జంట 15-11, 15-12తో మనీశ్- పూజ లత్కర్ జోడీపై, అవినాశ్- ఆనీ జార్జ్ జంట 21-9, 21-9తో కిరణ్ నారాయణ్- నీరజ్ గార్గ్ జోడీపై, హర్ష్- ఆస్థా సక్సేనా జంట 21-10, 21-11తో అజయ్- షిఖా జోడీపై, రాకేశ్- కుష్బూ జంట 22-11, 21-11తో ప్రవీణ్- సుభద్ర రాణి జోడీపై నెగ్గాయి. -
ఈవెంట్ నారి..
నిన్న మొన్నటిదాకా సాధారణ గృహిణి. ఇప్పుడు.. 100కిపైగా కార్పొరేట్ కంపెనీలు పాల్గొన్న స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వాహకురాలు. దేశవ్యాప్తంగా పేరొందిన కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ (సీబీఎల్)ను నిర్వహిస్తున్న మహిళగా ఘనత దక్కించుకున్నారు. నగరంలోని కార్పొరేట్ ఉద్యోగులకు స్పోర్ట్స్‌లోని టేస్ట్‌ని చూపిస్తున్న బాగ్ అంబర్‌పేట నివాసి శ్రీపాద శిరీష.. శిఖర ఈవెంట్స్ ఆధ్వర్యంలో రెండు సార్లు బ్యాడ్మింటన్ టోర్నీని నిర్వహించి.. ముచ్చటగా మూడో ఈవెంట్‌కు సిద్ధమవుతున్న వేళ సిటీప్లస్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. - ఎస్బీ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లోకి వస్తాననుకోలేదు. బీఎస్‌స్సీ కంప్యూటర్స్ చేసి జెన్‌ప్యాక్ట్‌లో జాబ్ చేసేదాన్ని. పెళ్లయి, బాబు పుట్టాక కూడా ఈ కెరీర్ గురించి ఆలోచన రాలేదు. నాలుగేళ్ల క్రితం మా అబ్బాయి ఫస్ట్ బర్త్‌డే నిర్వహించాలి అని ఈవెంట్ మేనేజర్లను సంప్రదించాం. వాళ్లు చెప్పిన బడ్జెట్ విని కళ్లు బైర్లు కమ్మాయి. ఫంక్షన్‌ను నేనే సొంతంగా ఎందుకు చేయలేను? అని ప్రశ్నించుకున్నాను. జస్ట్ డయల్ ద్వారా థీమ్ డెకార్ పర్సన్‌ని, ఫన్నీ గేమ్స్ ఆర్గనైజర్.. ఇలా ఒక్కొక్కర్ని వెతికి పట్టుకున్నా. మార్కెట్లో రేట్లు, రిక్వైర్మెంట్స్ చెప్పి.. అన్నీ దగ్గరుండి చేయించాను. ఈవెంట్ మేనేజర్ చెప్పిన దాంట్లో సగం ఖర్చుతో ఫంక్షన్ చేశాను. ఫంక్షన్‌కు వచ్చిన వాళ్లంతా ‘పెద్ద ఈవెంట్ మేనేజర్ చేశారనుకున్నాం.. నువ్వే చేశావా’ అంటూ ఆశ్చర్యపోయారు. దీంతో నా భర్త ప్రోత్సహించి ‘శిఖర’ ఈవెంట్స్ స్టార్ట్ చేయించారు. కార్పొరేట్ .. రెడ్‌కార్పెట్.. కొన్ని వెడ్డింగ్స్, పార్టీస్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేశాక.. రీజనబుల్ బడ్జెట్, క్వాలిటీ మేనేజ్మెంట్ను కోరుకునే కార్పొరేట్ కంపెనీలకు నా వర్క్ నచ్చడంతో.. రెగ్యులర్‌గా అవకాశాలు ఇవ్వడం ప్రారంభించాయి. అలా దాదాపు సిటీలోని ప్రతి కార్పొరేట్ కంపెనీ వర్క్ చేయగలిగాను. మొదట్లో మహిళ అంటూ కొన్ని రకాల ఈవెంట్లు ఇవ్వడానికి సంకోచించిన వాళ్లని కూడా తర్వాత తర్వాత రెగ్యులర్ క్లయింట్లుగా మార్చుకోగలిగాను. స్పోర్ట్స్ కల్చర్ పెంచాలని... వెడ్డింగ్స్‌తో బిజీగా ఉండే ఈవెంట్ మేనేజర్లు ఎవరూ చేయని విధంగా కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నీ కాన్సెప్ట్‌ను డిజైన్ చేయడానికి కారణం.. నా జాబ్ ఎక్స్‌పీరియన్సే. జాబ్ చేస్తున్నప్పటి నుంచే కార్పొరేట్ కంపెనీ ఉద్యోగుల లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఫిజికల్ యాక్టివిటీకి చాలా దూరంగా ఉండే వీరి కోసం ఏదో ఒక టైమ్ పాస్లా కాకుండా పూర్తిస్థాయి క్రీడా టోర్నీ నిర్వహించాలనుకున్నాను. సులభంగా ఎవరైనా నేర్చుకోగలిగిన, ఆడగలిగిన ఆట బ్యాడ్మింటన్. ఎక్కడ పడితే అక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు. అందుకే దీన్ని ఎంచుకున్నాను. ఈ ఆలోచన వచ్చిన వెంటనే పుల్లెల గోపీచంద్ వంటి క్రీడా ప్రముఖులతో మాట్లాడాను. నేను ఊహించిన దానికన్నా ఎక్కువగా లాస్ట్ ఇయర్ 73 కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. ఈ టోర్నీని మేం మనీ జనరేటింగ్ పర్పస్‌లో చూడలేదు. సింగిల్స్ ఎంట్రీ రూ.300 పెట్టాం. ఈ ఏడాది దాన్ని రూ.500గా నిర్ణయించడానికి కారణమిదే. మా సీబీఎల్ సక్సెస్‌కు నిదర్శనంగా ఈ ఏడాది పార్టిసిపేషన్ 107 కంపెనీలకు పెరిగింది. వందలాది ఉద్యోగుల్లో నుంచి ఐదుగురు విజేతలను ఎంపిక చేసి ట్రోఫీ, రూ.25 వేల నగదు బహుమతి కూడా అందిస్తున్నాం. ఈ పోటీల ద్వారా బాగా రీచార్జ్ అవుతున్నామని, వీటి గురించి ఏడాదంతా ఎదురు చూస్తామని కార్పొరేట్ స్టాఫ్ చెబుతుంటే దాని కోసం పడిన శ్రమంతా మర్చిపోతున్నా. ఆయా కంపెనీల స్టాఫ్‌లో బ్యాడ్మింటన్‌లో మంచి టాలెంట్ చూపించిన వారిని మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయేమో అని పరిశీలిస్తున్నాం. మరిన్ని కార్పొరేట్ క్రీడా టోర్నీలు నిర్వహించాలని, మరింత మంది మహిళలు ఈవెంట్ మేనేజర్లుగా మారేందుకు తోడ్పాటు నివ్వాలని భవిష్యత్ లక్ష్యం.