corporate taxes
-
కంపెనీల సమస్యాత్మక రుణాలు రూ.60 వేల కోట్లు అధికం!
ముంబై: ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభం కారణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, రేట్ల విషయంలో మారనున్న ఆర్బీఐ కఠిన వైఖరి, బలహీన రూపాయి కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో సమస్యాత్మక రుణాలు (రిస్కీ డెట్) రూ.60,000 కోట్ల మేర పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ తెలిపింది. కంపెనీల నిర్వహణ లాభంతో పోలిస్తే నికర రుణ భారం 5 రెట్లకు మించిన మొత్తాన్ని రిస్కీ డెట్‌గా పేర్కొంటారు. తాజా సంక్షోభం, అస్థిరతలతో ఈ తరహా రుణాలు 2022–23 ఆర్థిక సంవత్సరం చివరికి రూ.6.9 లక్షల కోట్లకు పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. వాస్తవానికి ఇవి రూ.6.3 లక్షల కోట్ల స్థాయిలోనే ఉండేవని తెలిపింది. 1,385 కంపెనీలను ఇండియా రేటింగ్స్ విశ్లేషించింది. యుద్ధ సంక్షోభం నేపథ్యంలో కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గడానికితోడు.. పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో లాభాల మార్జిన్లు తగ్గిపోతాయని అంచనాకు వచ్చింది. రూపాయి బలహీనత వల్ల రుణాలపై వడ్డీ భారం ఒక శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. కమోడిటీలను మడి సరుకులుగా వినియోగించుకునే కంపెనీల మార్జిన్లు 3 శాతం వరకు క్షీణిస్తాయని అంచనా వేసింది. -
పటిష్టంగా దేశ ఎకానమీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమల వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఊతమిచ్చే దిశగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు తగ్గించడంతో గత ఆరేళ్లుగా కేంద్రం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన వెబినార్‌లో పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: మంత్రి మాండవీయ నౌకాశ్రయాల్లో కార్గో హ్యాండ్లింగ్‌కు ఉపయోగపడే క్రేన్లు మొదలైన కీలక ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడంపై దేశీ కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. అలాగే, ఔషధాల తయారీలో ప్రధానమైన ముడి పదార్థాల ఉత్పత్తి కూడా దేశీయంగా పెంచాలని, తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాది ప్రాంత సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వర్చువల్ ప్లాట్‌ఫాం ద్వారా మంత్రి ఈ విషయాలు తెలిపారు. -
సెజ్‌లోని ఐటీ కంపెనీలపై..పన్ను తగ్గించండి
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) నుంచి పనిచేసే ఐటీ కంపెనీలపై 15 శాతమే కార్పొరేట్ పన్ను విధించాలని కేంద్రాన్ని ఐటీ పరిశ్రమ డిమాండ్ చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న దృష్ట్యా... దీనికోసం సోమవారం నుంచి వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్టార్టప్‌లు, మొబైల్ తయారీ, ఆర్థిక సేవల రంగాలకు చెందిన ప్రతినిధులు మంత్రి ముందు తమ డిమాండ్ల చిట్టాను విప్పారు. ఐటీ పరిశ్రమ.. ‘‘కొత్తగా ఏర్పడే తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేటును 15 శాతానికి తగ్గించారు. సెజ్‌లలో ఏర్పాటయ్యే కొత్త సేవల కంపెనీలకూ 15 శాతం రేటు అమలు చేస్తే సెజ్‌లలోని తయారీ, సేవల రంగాలకు ఒకటే రేటు అమలవుతుందని కేంద్రానికి సూచించాం’’ అని నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ చెప్పారు. ఉపాధి కల్పన, పెట్టుబడుల విషయంలో సెజ్‌లు భవిష్యత్తు వృద్ధికి కీలకమన్నారు. విస్తృతమైన టెక్నాలజీలపై (డీప్‌టెక్) పనిచేసే స్టార్టప్‌ల కోసం నిధితోపాటు, ఆవిష్కరణల సమూహాలను ఏర్పాటు చేయాలని సూచించినట్టు వెల్లడించారు. దేశంలో డేటా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సూచించినట్టు రిలయన్స్ జియో వైస్ ప్రెసిడెంట్ విశాఖ సైగల్ తెలిపారు. ఆర్థిక సేవల సంస్థలు.. టర్మ్ ఇన్సూరెన్స్ విస్తరణ కోసం జీఎస్టీ రేటును తగ్గించాలని, అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి కేవైసీ నిబంధనలను క్రమబద్ధీకరించాలని ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ రంగానికి చెందిన కంపెనీలు (బ్యాంకులు, బీమా కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు) ప్రభుత్వానికి సూచించాయి. ప్రభ్వురంగ బ్యాంకుల్లో పాలనను మెరుగుపరచడంపై, పీజే నాయక్ కమిటీ సిఫారసుల అమలుపై దృష్టి సారించాలని కోరాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో ఒత్తిళ్లను తొలగించి, నిర్వహణను మెరుగుపరిచే విషయమై కూడా సూచనలు చేశాయి. ఆర్థిక పరిమితులకు లోబడి వీటిని పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. ‘‘ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై పన్ను మినహాయింపును రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలని సూచించాయి. అటల్ పెన్షన్ యోజనలో ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లు చేయాలని కూడా కోరాం’’ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మొబైల్ పరిశ్రమ... ఇటీవల ప్రభుత్వం ఎగుమతులపై తగ్గించిన రాయితీలతో ఉద్యోగాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని, అలాగే, మొబైల్ హ్యాండ్సెట్లపై జీఎస్టీ రేటు తగ్గించాలని కోరింది. దేశంలో పెద్ద ఎత్తున తయారీకి ఇది అవసరమని పేర్కొంది. ఎగుమతులపై 8% రాయితీ ఇవ్వాలని కోరింది. జీఎస్టీ పరిహార చెల్లింపులకు కట్టుబడి ఉన్నాం ముంబై: జీఎస్టీ పరిహార చెల్లింపులపై కేంద్రం తన హామీని విస్మరించబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి భరోసానిచ్చారు. వసూళ్లు తగ్గినందునే పరిహార చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు వివరణ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు అసహనానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. పరిహారాన్ని వెంటనే కేంద్రం చెల్లించాలంటూ కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఇలా స్పందించారు. ‘‘ఇది వారి హక్కు. నేను తోసిపుచ్చడం లేదు. దీన్ని నిలబెట్టుకోకపోవడం ఉండదని స్పష్టం చేయదలుచుకున్నాను’’ అని వివరించారు. ముంబైలో సోమవారం జరిగిన టైమ్స్ నెట్వర్క్ ‘భారత ఆర్థిక సదస్సు’ను ఉద్దేశించి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డేటా (సమాచారం) విశ్వసనీయతపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాష్ట్రాలకు రూ.35,298 కోట్ల పరిహారం కీలకమైన జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఈ నెల 18న జరగనుండగా, రెండు రోజుల ముందు సోమవారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.35,298 కోట్లను జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి (సీబీఐసీ) ట్వీట్ ద్వారా తెలియజేసింది. సకాలంలో పరిహార చెల్లింపులను కేంద్రం విడుదల చేయకపోవడంతో పలు రాష్ట్రాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
కొత్త మైనింగ్ కంపెనీలకు వర్తించదు
న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్నుల భారం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి గురువారం పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో తీసుకువచ్చిన ట్యాక్సేషన్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు, 2019కు పార్లమెంటు ఓకే చెప్పింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ విధించే అంశంపై స్పష్టతనిచ్చారు. మైనింగ్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, బుక్ ప్రింటర్లకు కొత్త తయారీ కంపెనీలకు వర్తించే ‘కనిష్ట 15 శాతం పన్ను రేటు’ వర్తించబోదని ఉద్ఘాటించారు. నెగిటివ్ జాబితా రూపకల్పన... కార్పొరేట్ ట్యాక్స్ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20న ఈ మేరకు ఆర్థికమంత్రి ఒక ప్రకటన చేశారు. దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ తరువాత ప్రారంభించి 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభించే కొత్త తయారీ రంగ కంపెనీలకు కనిష్టంగా 15 శాతం రేటును వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి వెంటనే ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆర్డినెన్స్ స్థానంలో తీసుకువచ్చిన బిల్లుకు ఈ వారం మొదట్లోనే లోక్‌సభ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. పెద్దల సభ కూడా బిల్లులో ఎటువంటి మార్పూ చేయకుండా వెనక్కు పంపడంతో బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడినట్లయ్యింది. రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ప్రకారం– ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు 2019 ప్రకారం కొన్ని సంస్థలను నెగిటివ్ జాబితా ఉంచారు. ఈ జాబితాలో ఉంచిన సంస్థలు తయారీ రంగం పరిధిలోనికి రావని, వీటికి కనిష్ట 15 శాతం బేస్ రేటు వర్తించదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. ఇందులో మైనింగ్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, బుక్ ప్రింటర్లు ఉన్నట్లు వివరణ ఇచ్చారు. వీటితోపాటు స్లాబ్స్‌లో వినియోగించే మార్బుల్ బ్లాక్స్, సిలిండర్‌లోకి గ్యాస్ రీఫిల్లింగ్, సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్ ఉత్పత్తి కూడా నెగిటివ్ లిస్ట్‌లో ఉన్నాయి. ఆర్థిక వృద్ధి లక్ష్యంగా... ఆర్థికవృద్ధే లక్ష్యంగా కార్పొరేట్ పన్నులను తగ్గించినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వృద్ధికి ఊతం ఇవ్వడం లక్ష్యంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ యంత్రాంగ ంలో అలసత్వ నిరోధం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ప్రోత్సాహం, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వంటి పలు చర్యలు ఈ దిశలో ఉన్నాయన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపువల్ల పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ దేశంగా అవతరిస్తోందని వివరించారు. ఆర్థికరంగం పునరుత్తేజమే ధ్యేయంగా కేంద్రం తన చర్యలను కొనసాగిస్తుందని తెలిపారు. -
కార్పొరేట్ పన్ను తక్కువుండే దేశాలివే
లండన్: ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలను ఆహ్వానించేందుకు పలు దేశాలు అతి తక్కువ పన్నులను విధించడం లేదా పలు పన్ను రాయితీలు కల్పించడం చేస్తున్న విషయం తెల్సిందే. ఏ దేశంలో అతి తక్కువగా కార్పొరేట్ పన్నులు ఉన్నాయి? ఏ దేశంలోని కార్పొరేట్ కంపెనీలు పన్నుల భారాన్ని తప్పించుకునేందుకు ఓ చోట సంపాదించిన ఆదాయాన్ని పన్ను రాయతీలున్న మరో చోట చూపిస్తున్నాయో అధ్యయనం జరిపి ‘ఆక్స్‌ఫామ్’ అనే అంతర్జాతీయ చారిటీ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. అసలు పన్నులు లేని దేశాల నుంచి అతి తక్కువ పన్నులున్న దేశాల జాబితాలో మొదటి రెండు స్థానాలను బెర్ముడా, కేమన్ ఐలాండ్స్ ఆక్రమించాయి. ఎందుకంటే ఈ రెండు దేశాల్లో కార్పొరేట్ ఆదాయంపై పన్ను అసలు లేదు. ఆ తర్వాత నెదర్లాండ్స్, స్విడ్జర్లాండ్, సింగపూర్, ఐర్లాండ్, లగ్జమ్‌బర్గ్, కురకావో, హాంకాంగ్, సైప్రస్, బహమాస్, జెర్సీ, బార్బడోస్, మార్శష్, బ్రిటన్ వర్జిన్ ఐలాండ్స్ దేశాలున్నాయి. బెర్ముడా, కేమన్ ఐలాండ్స్‌తోపాటు జెర్సీ, వర్జిన్ ఐలాండ్స్ దేశాలు బ్రిటిష్ సార్వభౌమాధికారం కిందనే ఉన్న విషయం తెల్సిందే. నెదర్లాండ్స్, లగ్జమ్‌బర్గ్, సింగపూర్, స్విడ్జర్లాండ్, హాంకాంగ్ లాంటి దేశాల్లో కార్పొరేట్ కంపెనీలు పన్నులు చెల్లించే సామర్థ్యంకన్నా అతి తక్కువగా పన్నులు ఉన్నాయి. ప్రపంచంలోని అతి పెద్ద అంతర్జాతీయ కంపెనీల్లో 90 శాతం కంపెనీలకు పన్నుకు స్వర్గధామమైన దేశంలో తప్పనిసరిగా ఓ బ్రాంచ్ కంపెనీ ఉంటోంది. అంటే వేరే దేశాల్లో వచ్చిన ఆదాయాన్ని పన్ను తక్కువగా ఉన్న దేశాల్లో అవి చూపిస్తున్నాయి. గత పదేళ్లలో కార్పొరేట్ కంపెనీల ఆదాయం పెరుగుతున్నప్పటికీ అవి చెల్లిస్తున్న పన్నుల శాతం మాత్రం తగ్గుతూ వస్తోంది. పదేళ్ల క్రితం కార్పొరేట్ ఆదాయం పన్ను సరాసరి సగటున 27.5 శాతం ఉండగా, అది ఇప్పుడు 23.6 శాతానికి చేరుకొంది. గత 30 ఏళ్ల కాలంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయం మూడింతలు పెరిగింది. 1980లో కార్పొరేట్ కంపెనీల ఆదాయం రెండు లక్షల కోట్ల డాలర్లుకాగా, 2013 నాటికి. 7.2 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని 360 కోట్ల మంది ప్రజల వద్ద ఎంత సొమ్ము ఉందో, కేవలం 62 మంది వ్యాపార దిగ్గజాల వద్ద అంత సొమ్ము ఉందని ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో వెల్లడైంది. కార్పొరేట్ పన్నుల వ్యవస్థ, కంపెనీల ఆదాయ వివరాల వెల్లడి పారదర్శకంగా లేకపోవడ వల్ల ప్రజల ఆర్థిక వనరుల మధ్య రోజురోజుకు వ్యత్యాసం పెరుగుతోందని ఆక్స్‌ఫామ్ ఆందోళన వ్యక్తం చేసింది.