దర్జాగా కార్పొరేషన్ స్థలం కబ్జా
గుంటూరులో టీడీపీ మాజీ కార్పొరేటర్ భూ దాహం
మరుగుదొడ్ల స్థలంలో ఇల్లు నిర్మించేందుకు యత్నం
స్థానికుల ఫిర్యాదుతో కదలిన యంత్రాంగం
గుంటూరు (అరండల్‌పేట): నగరంలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నాయకుడి స్థాయిని బట్టి ప్రభుత్వ, కార్పొరేషన్ స్థలాలను కబ్జా చేసేస్తున్నారు. తాజాగా నగరంలోని శారదాకాలనీలోని కార్పొరేషన్ స్థలాన్ని మాజీ కార్పొరేటర్ కబ్జా చేసి అందులో ఇల్లు నిర్మాణం చేపట్టారు. స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
నగరంలో 35 సంవత్సరాల క్రితం శారదాకాలనీని ఏర్పాటు చేశారు. ఇక్కడ పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చారు. కాలనీలో నివసిస్తున్న పేదల కోసం 28వ లైనులోని కార్పొరేషన్‌కు చెందిన ఐదు సెంట్ల స్థలంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. రెండు దశబ్దాల వరకు మరుగుదొడ్లును స్థానికులు వినియోగించుకున్నారు. కాలక్రమంలో అవి శిథిలావస్థకు చేరడంతో వాటిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అక్కడ నివసించే కొంతమంది ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా కార్పొరేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఐదు సెంట్ల స్థలంలో ఒక సెంటును ఓ వ్యక్తికి కేటాయిస్తూ పట్టా ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే తాజాగా టీడీపీ అధికారంలోకి రావడం, భూమి రేట్లు పెరగడంతో దీనిపై మాజీ కార్పొరేటర్ గోళ్ళ ప్రభాకర్ కన్ను పడింది. ఇంకేముంది ఈ స్థలాన్ని కబ్జా చేసి కొద్దిరోజులుగా ఇల్లు నిర్మిస్తున్నారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. అధికారపార్టీ నాయకుడు కావడం, అడిగే వారు లేకపోవడంతో శరవేగంగా నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు రంగం సిద్ధం చేశారు.
నాలుగు సెంట్ల స్థలం కబ్జాకు గురికావడం గమనించిన స్థానికులు నగర కమిషనర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. కబ్జాను వెంటనే అడ్డుకోవాలని పట్టణ ప్రణాళికాధికారిని ఆమె ఆదేశించారు. దీంతో పట్టణ ప్రణాళికాధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి కబ్జాను అడ్డుకున్నారు. రెండురోజుల్లో ఆ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్‌కు చెందిన స్థలంగా బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో కార్పొరేషన్ స్థలం కబ్జా చేయాలనుకున్న సదరు నాయకుని ప్రయత్నం విఫలమైంది.