ధాన్యానికి ధర దగ
తాడేపల్లిగూడెం : ప్ర స్తుత సార్వా సీజన్ రైతులకు కొంత ఊరటనిచ్చేలా కనిపిస్తోంది. సీజన్ ఆరంభంలోనే ధాన్యానికి ఆశాజనకమైన ధర లభిస్తోంది. మెట్ట ప్రాంతంలో వరి కోతలు, ధాన్యం మాసూళ్లు ఊపందుకోగా.. ఒబ్బిడి చేసిన ధాన్యాన్ని మిల్లర్లు, వ్యాపారులు అప్పటికప్పుడే కళ్లాల వద్ద కొనుగోలు చేస్తున్నారు. 28 శాతం తేమగల ధాన్యం బస్తా (75 కేజీలు)కు రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. ఆరుదల ధాన్యాన్ని (తేమ శాతం 16 ఉంటే) బస్తాకు రూ.1,250 చెల్లిస్తున్నారు. సాధారణంగా కొట్టుపొట్టు (28 శాతం తేమ ఉండే) ధాన్యాన్ని రూ.850 నుంచి రూ.900కు కొనుగోలు చేసేవారు. ఈసారి బస్తాకు రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా చెల్లిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మెట్టలో ముమ్మరం
మెట్ట ప్రాంతాల్లో సార్వా మాసూళ్లు ఊపందుకున్నాయి. సాధారణంగా దీపావళి నాటికి గాని వరి పంట చేతికి రాదు. ఈసారి మెట్టలో వ్యవసాయ పంపుసెట్ల కింద నాట్లు ముందుగా వేశారు. దీంతో పది రోజులుగా మాసూళ్లు సాగుతున్నాయి. వ్యాపారులు, మిల్లర్లు రైతుల నుంచి ఆరబెట్టని ధాన్యాన్ని అప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో తేమ శాతం 28 ఉన్నప్పటికీ కొనుగోలు చేయడానికి వ్యాపారులు వెనుకంజ వేయడం లేదు. ఆరుదల ధాన్యానికి బస్తాకు రూ.1,250 పలుకుతున్నప్పటికీ.. వాతావరణం రోజుకో రకంగా మారుతుండటంతో రైతులు కోసిన ధాన్యాన్ని కోసినట్టే విక్రయిస్తున్నారు. ధాన్యంలో తేమ 17 శాతం వచ్చేవరకు ఆగడం కంటే వెంటనే అమ్మేసుకోవడమే బాగుందని పలువురు రైతులు చెబుతున్నారు. మెట్టలో ఎక్కువగా 1010 రకం ఊడ్చారు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో రోజుకు 25 లారీల ధాన్యం అమ్మకాలు సాగుతున్నాయి.
ఎగుమతుల నేపథ్యంలోనే..
దక్షిణాఫ్రికా దేశాలు 1010 రకం బియ్యాన్ని పెద్దఎత్తున దిగుమతి చేసుకునేందుకు ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎగుమతి దారులకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)లు ఇచ్చాయి. దీంతో ఇక్కడి వ్యాపారులంతా దక్షిణాఫ్రికాకు బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితుల్లో ధాన్యం ధరలు మెరుగుపడ్డాయి. పాత ధాన్యం విషయానికొస్తే 1010 రకం బస్తా (75 కేజీలు) రూ.1,250 వద్ద స్థిరపడింది. పీఎల్ రకం రూ.1,400, సోనా రకం రూ.1,750 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.